‘సీమ’కు బాబు చేస్తున్న ద్రోహంపై ‘చలో పోతిరెడ్డిపాడు’ | - | Sakshi
Sakshi News home page

‘సీమ’కు బాబు చేస్తున్న ద్రోహంపై ‘చలో పోతిరెడ్డిపాడు’

Feb 4 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:13 AM

‘సీమ’కు బాబు చేస్తున్న ద్రోహంపై ‘చలో పోతిరెడ్డిపాడు’

‘సీమ’కు బాబు చేస్తున్న ద్రోహంపై ‘చలో పోతిరెడ్డిపాడు’

‘సీమ’కు బాబు చేస్తున్న ద్రోహంపై ‘చలో పోతిరెడ్డిపాడు’

త్యాగపురుషుడి అవతారం ఎత్తిన చంద్రబాబు : శ్రీకాంత్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా వద్ద ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్‌వీ సతీష్‌ కుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ రఘురామిరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ, మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌లతో కలిసి ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఎండబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు చేపట్టకపోతే భవిష్యత్‌లో ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబుతో తనకున్న సాన్నిహిత్యం వల్ల రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారన్నారు. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ దీన్ని ఖండించలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఈ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుందన్నారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచారని, నారాయణ పూర్‌ ప్రాజెక్టు పూర్తి చేశారన్నారు. దీనివల్ల వరద రోజులు 150 నుంచి 70 రోజులకు తగ్గిపోయాయన్నారు. మరోవైపు తెలంగాణ కూడా 798 అడుగుల ఎత్తులోనే పాలమూరు –రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు చేపట్టడంతో కృష్ణా జలాలన్నీ ఆ రెండు రాష్ట్రాలే వాడుకునే పరిస్థితి ఉందని, వరద దినాలు కూడా 30కి తగ్గిపోయాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 801 అడుగుల్లోనే నీటిని తీసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజూ 3 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంటుందన్నారు. యజ్ఞయాగాదులను రాక్షసులు అడ్డుకున్నట్లు ఆ ప్రాజెక్టు చేపడుతున్నప్పుడే చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్‌జీటీలో ఫిర్యాదు చేయించారని గుర్తు చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు తరలి రావాలని పిలుపునిచ్చారు.

● ఈ కార్యక్రమంలో కడప నగర డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్‌, ఆర్‌.వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను, కృష్ణా జలాలను తెలంగాణకు ఫణంగా పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు త్యాగ పురుషుడి అవతారం ఎత్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఆపేసినందుకు సిగ్గు పడకుండా ఆ ప్రాజెక్టుతో ఏం అవసరమని మాట్లాడటం దారుణమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో 111 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు 104 మంది ఉన్నారన్నారు. సాగునీరు లేక, వ్యవసాయం లాభసాటిగా లేక వారు తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా కృష్ణా జలాలపై మనం హక్కులు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి రైతులు తరలిరావాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement