అక్రమ ముగ్గురాయి మైనింగ్‌లో ప్రమాదం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వేముల సమీపంలో కుమ్మర గుట్ట వద్ద అక్రమ ముగ్గురాయి మైనింగ్‌లో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అక్రమ ముగ్గురాయి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా భూగర్భగనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కడపకు చెందిన ఓ వ్యక్తి అక్రమ ముగ్గురాయి మైనింగ్‌ను వేంపల్లె, వేముల మండలాలకు చెందిన కొంత మంది టీడీపీ నాయకులు పర్సంటేజీకి మాట్లాడుకుని అక్రమంగా ముగ్గురాయిని వెలికి తీస్తున్నారు. ఈ మైనింగ్‌లో రోజూ మూడు షిప్టులలో కూలీలు పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజు మాదిరిగానే కూలీలు మైనింగ్ పనులకు వెళ్లారు. ఈ మైనింగ్‌లో ప్రమాదం జరగడంతో వేములకు చెందిన అబ్దుల్ బాషా, వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వీరిని నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా చికిత్స నిమిత్తం కడప ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు సమాచారం.
కూలీల ప్రాణాలను బలిగొంటున్న
అక్రమ ముగ్గురాయి తవ్వకాలు :
అక్రమ ముగ్గురాయి తవ్వకాల వలనే ప్రమాదాలు జరిగి కూలీలు మృతి చెంది ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గత ఏడాది నందిపల్లె వద్ద జరిగిన మైనింగ్ ప్రమాదంలో అమ్మయ్యగారిపల్లెకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. అలాగే 2024లో కొత్తపల్లె గ్రామ సమీపంలో డైనమెట్లు పేల్చి ఓ వ్యక్తి మరణానికి దారి తీసింది. వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమంగా టీడీపీ నాయకులు యథేచ్ఛగా ముగ్గురాయి తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నా.. భూగర్భగనుల శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక టీడీపీ అధికారంలోకి రాగానే టిఫిన్ కంపెనీ వద్ద ఉన్న కోట్ల విలువ చేసే ముగ్గురాయిని కొంత మంది టీడీపీ నాయకులు రాత్రికి రాత్రే తరలించి సొమ్ము చేసుకున్నా పట్టించుకున్న పాపానపోలేదు. అక్రమ ముగ్గురాయి తవ్వకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ముగ్గురాయి తవ్వకాలు కూలీల ప్రాణాల మీదకు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కూలీల ప్రాణాలు కోల్పోతే రాజీ కుదుర్చుకుని అంతో, ఇంతో డబ్బులు ముట్టజెప్పి చేతులు దులుపుకొంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు
గుట్టు చప్పుడు కాకుండా కడప ఆసుపత్రికి తరలింపు
చోద్యం చూస్తున్న భూగర్భ గనుల శాఖ అధికారులు


