తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీల నోరు కొట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు. పేదల జీవితాలు మెరుగు పడటం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఒకరి జాబ్ రార్డు తొలగించాలంటే గ్రామ సభ పెట్టాలని, అలాంటి నిబంధనలకు కూడా పట్టించుకోకుండా ఏకంగా 16 లక్షల మంది కార్డులు ఎలా తొలగించారని ప్రశ్నించారు.
ఎస్సీలలో 18.7%, ఎస్టీలు 17% మంది ఉపాధి కోల్పోయారన్నారు. వ్యవసాయం చేస్తే వ్యాధులు వస్తాయని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి వలన రైతులు, రైతు కూలీలు ఎలా బాగు పడతారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని వైఎస్సార్ తెస్తే చంద్రబాబు నిలువునా తొలగించారన్నారు.
కూలి చేసుకుని బతుకుతామంటే జాబ్ కార్డులను తొలగించారని, పేదలను తొలగిస్తుంటే సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించి కూటమి నేతకు తమ వారిన పెట్టుకున్నారని, వారిని అడ్డం పెట్టుకుని కూలీలను తొలగించేశారని, పేదల కడుపు మీద కొట్టారని ధ్వజమెత్తారు.


