
విశాఖ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సింగపూర్ పర్యటనే ఉంటుందని, అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచు వెళ్తుంటారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీసీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ రోజు( ఆదివారం, జూలై 27) విశాఖ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అమర్నాథ్.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో రూ. 3 వేల కోట్ల భూములను వాళ్లకు కావాల్సిన వారికి అప్పగించే పనిలో ఉన్నారని మండిపడ్డారు.
‘ ఊరు పేరు లేని ఊర్సా కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ గల 60 ఎకరాల భూమి కేటాయించారు. ఆ సంఘటన మరుకముందే మరో 60 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చారు. సత్వ, కపిల్ వంటి వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కారు చౌకగా భూములు అప్పగించారు.. ఈ భూ కేటాయింపులో క్రీడ్ ప్రో కో ఉంది. ఐటీ కంపెనీలకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారు.
చీకటి ఒప్పందంలో భాగంగానే భూ కేటాయింపులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సింగపూర్ వెళ్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును సింగపూర్ లో దాస్తున్నారు. చంద్రబాబు అవినీతి గురించి కోలా కృష్ణ మోహన్ చెప్పారు. చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అవినీతి కేసులో జైలకు వెళ్లారు. చంద్రబాబు సింగపూర్ ఈశ్వరన్ కవల పిల్లలులా తిరిగేవారు. ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల్లో సింగపూర్ ఒకటి. అటువంటి అవినీతి దేశంలో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు. సంపాదించిన అవినీతి డబ్బు దాచేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి పెట్టుబడి తెచ్చారా?, దుబాయ్ శ్రీనులా, సింగపూర్ చంద్రబాబులా పేరును ఆయన సంపాదించుకున్నారు’ అని విమర్శించారు.