
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పీ-4 పరుతో టీచర్లను వేధించడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారని, మరొకవైపు టీచర్లు కూడా పీ-4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారని మండిపడ్డారు.
ఈరోజు(సోమవారం, జూలై 28) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారు. మరోవైపు టీచర్లు కూడా p4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారు. అసలు జీతాలే సరిగ్గా ఇవ్వకుండా మళ్ళీ దత్తత తీసుకోవటం ఏంటి?, ఎన్నికలలో గెలుపు కోసం సంపద సృష్టిస్తానంటూ చెప్పి ఇప్పుడు టీచర్లను దత్తత తీసుకోమనటం అన్యాయం. పారిశ్రామిక వేత్తలు, సంపన్నులతో దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

ఇప్పుడేమో టీచర్లనే తీసుకోమని కలెక్టర్లతో చెప్పిస్తున్నారు. బలవంతంగా దత్తత తీసుకోమని బెదిరించడం అన్యాయం. పరిపాలనా విధానాన్ని సర్వ నాశనం చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోంది. దేశంలో చాలామంది పన్నులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి పన్నులు వసూలు చేస్తే లక్షలమంది పేదల జీవితాల్లో మార్పు తేవచ్చు.
పాఠాలు చెప్పాల్సిన మమ్మల్ని p-4 కోసం వాడుకోవటమేంటని టీచర్లు అడుగుతున్నారు. టీచర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగులతో రాజకీయ నాయకుల కాళ్లు పట్టించుకోవడం సిగ్గుచేటు. విరామం లేకుండా డ్యూటీ చేయించటం వలన రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఉద్యోగుల మీద ఒత్తిడి చేసి వారిని వేధించవద్దు’ అని ఆయన సూచించారు.