చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం

Published Wed, Mar 20 2024 1:18 PM

Yellow Media blaming police for TDP, Janasena failures - Sakshi

తుస్సుమన్న చిలకలూరిపేట సభ

వైఫల్యాన్ని పోలీసులపై నెట్టేసేందుకు టిడిపి, ఎల్లోమీడియా ప్రయత్నం

ప్రధాని సభకు సరైన మైకులు పెట్టడం చాతకాలేదా?

మోదీని సన్మానించడానికి శాలువా, పూలబోకే తీసుకురాలేకపోయారా?

మీ చాతకాని తనాన్ని పోలీసుల మీద వేస్తారా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు  నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర  ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది.

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు  నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ  అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి  కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది.


(సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్‌)

మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు  పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి.

తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది.

 • జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ.
 • అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని  టిడిపి పేర్కొంది.
 • దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది.
 • విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది.
 • ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది.
 • మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది.
 • ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం.
 • ఇక సభకు వస్తున్న  వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది.
 • సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం.
 • డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది.


(సభలో పరిస్థితి)

ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది.

 • ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు.
 • అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు.
 • కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట.
 • అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
 • మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం?
 • చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్‌ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది.
 • ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు.
 • SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు?


(మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్‌)

టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు  వ్యాఖ్యానిస్తున్నారు.

 • సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది.
 • వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు?
 • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు.
 • రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు.
 • ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు.
 • కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు.

ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది.

 • RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది.
 • విషయం ఏమిటంటే 2500 RTC బస్‌లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా!

అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు.

 • సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు?
 • ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు?
 • గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు?
 • గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు?
 • మనుష్యులు మరణించినప్పుడు  ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా?
 • గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా?
 • కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు.

ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది.  అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు?

- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
 
Advertisement
 
Advertisement