కేరళం సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ..! | Who Will Be Keralas Next Chief Minister | Sakshi
Sakshi News home page

కేరళం సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ..!

May 4 2026 7:56 PM | Updated on May 4 2026 8:18 PM

Who Will Be Keralas Next Chief Minister

కేరళంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుపుతో సీఎం రేసు హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్ద కాలం తర్వాత కేరళంను కాంగ్రెస్‌ దక్కించుకోవడంతో అక్కడ కాస్త జోష్‌ వచ్చింది. ఓవరాల్‌గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను చూస్తే కేరళంలో మాత్రమే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ మాత్రమే ఆధిక్యాన్ని కనబర్చింది. కేరళంలో ఉన్న 140 అసెంబ్లీ సీట్లకు గాను 102 సీట్లను యూడీఎఫ్‌ దక్కించుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. 

మరి సీఎం ఎవరు?
కాంగ్రెస్‌ ఎక్కడైనా అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు కేరళంలో అదే రిపీట్‌ అవుతుంది. ప్రస్తుతం కేరళంలో సీఎం పీఠం కోసం కాంగ్రెస్‌ ముఖ్యనేతల్లోనే పోరు తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేరళంలో సీఎం రేసులో ఉన్న వారిలో వీడీ సతీశన్‌, రమేష్‌ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌తో పాటు శశిథరూర్‌ కూడా ఉన్నారు. 

మాకు చాలా మందే ఉన్నారు..
ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారనుకుంటే ఇప్పుడు శశిథరూర్‌ సైతం  ఆ జాబితాలో చేరిపోయారు. వివాదాస్పద ఎంపీగా పేరున్న శశిథరూర్‌ తాజా వ్యాఖ్యలు తనను కూడా సీఎం అభ్యర్థికి అర్హుడుననే సంకేతాలిచ్చాయి. మరి ఆయనే స్వయంగా ఆ జాబితాలో చేరిపోయారా.. లేక కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలతోనే ఇలా వ్యాఖ్యానించారా అనేది తర్వాత తెలుస్తుంది. 

ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉండగా, ఇంకా ఎవరైనా వచ్చి ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  తుది నిర్ణయం హైకమాండ్‌దే అని శశిథరూర్‌ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. హైకమాండ్‌ దగ్గర శశిథరూర్‌ మంచి మార్కులు ఉన్నాయా అంటే అది పూర్తిగా అవునని చెప్పలేం.

సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి జై కొట్టే శశిథరూర్‌.. కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ కోపానికి తరుచు గురవుతూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో శశిథరూర్‌ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. 

సతీశన్‌ది కీలక పాత్ర
కేరళంలో కాంగ్రెస్‌  విజయం సాధించడంలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర. ప్రస్తుతం  ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారాయన. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న  సతీశన్‌కు సీఎం పీఠం దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ పోటీ గట్టిగా ఉండటంతో ఏమౌతుందో చివర వరకూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీఎం పీఠంపై సతీశన్‌ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు అనుభవంలోకి వస్తాయా.. లేక అడియాశలుగా మిగిలిపోతాయనేది అధిష్టానమే నిర్ణయించాలి. 

రమేశ్ చెన్నితలది అనుభవం..
కేరళం కాంగ్రెస్‌లో సీనియర్‌గా పేరున్న రమేశ్‌ చెన్నితలకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఆర్గనైజేషన్‌లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభం; తరువాత నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా ఎదిగారు. 1982లో హరిపాడ్ నుండి మొదటిసారి గెలుపొందారు. 

1989–1998లో కోట్టాయం, మావేలికర నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి సేవలందించారు. 1986-87లొ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. 2014 నుంచి 2016 వరకూ హోమ్‌ అండ్‌ విజిలెన్స్‌ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. 

కాంగ్రెస్‌ అధినాయకత్వంతో సన్నిహితంగా..
కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌. ప్రస్తుతం ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు మరియు 2026లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఈయనకి రాజకీయ అనుభవం విశేషంగానే ఉంది. 2019 నుండి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌ అధినాయకత్వానికి అతి దగ్గరగా ఉండే వేణుగోపాల్‌ అంటే  హైకమాండ్‌కు బాగా నమ్మకం ఎక్కువ. దాంతో కేసీ వేణుగోపాల్‌ కూడా సీఎం అభ్యర్థి కోసం చివరి వరకూ రేసులో ఉండటం ఖాయం.

ఈ నలుగురితోనే సరా.. ఇంకా వస్తారా?
ప్రస్తుతానికి ఈ నలుగురు  మాత్రమే సీఎం రేసులో ఉన్నారు. మరి ఇంకే ఎవరైనా పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో పలు బుజ్జగింపుల తర్వాతే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ ప్రకటిస్తూ రావడం చూస్తునే ఉన్నాం.  ఇప్పుడు ఇంకా ఎవరైనా తాను కూడా సీఎం అభ్యర్థినేని పోటీ కొస్తే మాత్రం అధిష్టానికి తలనొప్పులు తప్పవు. ఏది ఏమైనా కేరళంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు విజయోత్సవ మూడ్‌లో ఉంది. రేపట్నుంచి సీఎం కుర్చీ కోసం రేసు మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement