నా కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగొద్దు: కేశినేని చిన్ని

Vijayawada: Disputes between Kesineni brothers exposed - Sakshi

టీడీపీ ఎంపీ కేశినేని నానికి సోదరుడు చిన్ని సూచన

తాను ఎంపీ స్టిక్కర్‌ను ఉపయోగించి దందా చేయలేదని వెల్లడి  

సాక్షి,న్యూఢిల్లీ/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాజకీయ స్వప్రయోజనాల కోసం తన కుటుంబసభ్యుల పేర్లను వివాదంలోకి లాగవద్దని టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని సూచించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన కారుకు ఎంపీ స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్నానంటూ పోలీసులకు కేశినేని నాని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు.

కారుకు ఆయన స్టిక్కర్‌ను అంటించుకుని దందా చేస్తే వెంటనే బహిర్గతం అయ్యేదని, తాను వ్యాపారులెవ్వరినీ బెదిరించలేదని చెప్పారు. వ్యాపారులను బెదిరిస్తే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా.. ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ కేశినేని నానిని ప్రశ్నించారు. ఆయన్ని శత్రువుగా కాకుండా.. సొంత అన్నగానే భావిస్తున్నానని చెప్పారు. నాని చేసిన ఫిర్యాదు వ్యక్తిగతమైనదే తప్ప.. రాజకీయపరమైనది కాదన్నారు. దీనిపై పోలీసుల విచారణ ముగిసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. 

స్టిక్కర్‌ను ఫోర్జరీ చేశారు: ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఎంపీగా తనకు మంజూరు చేసిన కారు స్టిక్కరును ఫోర్జరీ చేసి టీఎస్‌ 07 హెచ్‌డబ్ల్యూ 7777 రిజిస్ట్రేషన్‌ ఉన్న కారుకు వినియోగిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కారు స్టిక్కరును ఫోర్జరీ చేసిన సంగతి 2 నెలల క్రితం తన దృష్టికి వచ్చిందని.. వెంటనే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీన్ని భద్రతాపరమైన అంశంగా పరిగణించాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top