జిన్నా టవర్‌పై జెండా ఎగురవేసే ప్రయత్నం 

Vellampalli Srinivas Fires On BJP - Sakshi

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌)/సాక్షి, అమరావతి: గుంటూరు జిన్నా టవర్‌ సెంటర్‌లోని జిన్నా స్థూపంపై జెండా ఎగురవేయాలని ప్రయత్నించిన వీహెచ్‌పీ సభ్యులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం రోజు బుధవారం జిన్నా టవర్‌పై జెండా ఎగురువేయడానికి ఈవూరి జగన్‌ సాయినాథ్‌రెడ్డి, రావిరాల జీవన్‌బాబు, గిరిఈశ్వర్, కె.దుర్గాబాబు, నల్లమేకల సురేష్‌ వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. కొత్తపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోనూ ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్ర: మంత్రి వెలంపల్లి 
‘జిన్నా టవర్‌పై రాద్ధాంతం బీజేపీ కుట్రే. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ‘రాష్ట్రంలో 2014 – 19 మధ్య టీడీపీతో కలిసి అధికారాన్ని అనుభవించిన బీజేపీకి గుంటూరులో జిన్నా టవర్‌ ఉందని గుర్తు రాలేదా? 100 ఏళ్ల క్రితం నిర్మించిన టవర్‌ గురించి ఇప్పుడు గొడవ పెడుతున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? కేంద్ర మంత్రులు పదే పదే రాష్ట్రానికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతేనా? ఏ ప్రభుత్వమైనా ఒక వర్గం పట్ల ఒకలా, మరో వర్గం పట్ల ఇంకోలా వ్యవహరిస్తుందా? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటోంది. మా ప్రభుత్వం ఏవర్గానికి వ్యతిరేకం కాదు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోము. అలజడులు సృష్టించేవారిపై కఠిన చర్యలు చేపడతాం’ అని వెలంపల్లి చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top