Union Budget: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!

Union Budget Reactions Congress BJP TMC SP BSP PDP AAP - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‍కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి.

వాళ్ల కోసమే: కాంగ్రెస్
కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు.

బడ్జెట్‌లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు.

ప్రజా వ్యతిరేకం: మమత
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే  దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు.

సవతి ప్రేమ: కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్‌లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని విమర్శించారు.

ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్‌ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు.

ఆశ లేదు నిరాశే: అఖిలేష్
కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‍వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు.

ఎప్పటిలాగే చేశారు: మాయావతి
ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్‌ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు.

కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ
గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు.
చదవండి: బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top