తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

TS Elections 2023: TPCC Chief Revanth Reddy Open Letter TS People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయని.. ప్రజలు ఇది గమనించి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని లేఖలో కోరారాయన. 

‘‘బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కు అయ్యాయి. కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి. అత్యున్నత ప్రభుత్వ సంస్థల్ని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని మోదీ, కేసీఆర్‌లు రాజకీయ క్రీడలో పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీలో  చేరినవాళ్లు పవిత్రులు.. ఇతర పార్టీలో చేరి ప్రజల తరఫున పోరాడితే వాళ్లు ద్రోహులా?. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా  చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య కుదిరిన కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఇది’’ అని లేఖలో పేర్కొన్నారయన. 

.. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?!. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి?. గడచిన పదేళ్లలో మోదీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని లేఖ ద్వారా కోరారు రేవంత్‌.  

కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే కదా జరుగుతున్నది!. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది. కేసీఆర్కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై.. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు.

.. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు... కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?! . పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు’’ అని రేవంత్‌రెడ్డిలో లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top