మోదీ పాలనలో ప్రమాదంలోకి దేశం

టీపీపీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి /నిజాంసాగర్: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో భారతదేశం ప్రమాదంలోకి వెళ్లిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశ రక్షణ కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరుతూ ఈ పాదయాత్ర చేయడం లేదని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా, బీజేపీ పరిపాలనలో చోటు చేసుకుంటున్న అరాచకాలు, దుర్మార్గమైన చర్యల నియంత్రణ కోసం రాహుల్ చేపట్టిన ఈ పాదయాత్రకు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గాయత్రి కర్మాగారం వద్ద రాహుల్‌గాంధీ పాదయాత్రపై ఏర్పాటు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధానాన్ని ప్రధాని మోదీ పక్కదారి పట్టించారని, తాత్కాలిక అధికారం కోసం మోదీ, అమిత్ షాలు ప్రకంపనలు సృష్టిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
ఆ ప్రకంపనలు దేశం నలుమూలలా కన్పిస్తున్నాయన్నారు. ప్రతిచోటా దాడులు జరుగుతున్నాయని, దాడులకు గురవుతున్న దళితులు అభద్రతా భావానికి గురవుతున్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, దామోదర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సుదర్శన్‌రెడ్డి, వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.