‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’ | Tjr Sudhakar Babu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’

Apr 26 2026 2:05 PM | Updated on Apr 26 2026 2:09 PM

Tjr Sudhakar Babu Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు.

..టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్‌ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు

..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా

..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్‌ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు.

..తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు

..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్  రూమ్‌లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్‌గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్‌లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్‌కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement