రూపాయి, సిపాయి విలువలను దిగజార్చింది

Telangana Minister Harish Rao Flays Kishan Reddy Remarks Over Agnipath Scheme - Sakshi

అన్ని వర్గాల ప్రజల ఉసురుపోసుకుంటోంది 

గాంధీని చంపిన గాడ్సేని వీరుడంటున్నారు... కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కేంద్రంలోని బీజేపీ సర్కారు రూపాయి విలువను దిగజార్చిందని,  సిపాయిల విలువను తగ్గించిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన నూతన సైనిక నియామక విధానంపై ఆయన స్పందించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించే సిద్ధపడి ఆర్మీలో చేరే యువత నాలుగేళ్లు పనిచేసిన అనంతరం కటింగ్‌ చేసుకుని, ఇస్త్రీ చేసుకుని బతకాలంటూ అవమానపరిచే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం సబబు కాదన్నారు.

సిపాయిల విలువను కూడా తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పతనావస్థకు చేరుకుందన్నారు. హరీశ్‌రావు సోమవారం సంగారెడ్డి జిల్లా తాలెల్మలో రూ.37 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాక బహిరంగసభలో మాట్లాడారు. ఉన్న ఊరును, కుటుంబాలను వదిలి ఇరవై, ముప్పై ఏళ్లు చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పనిచేసిన సైనికులకు కేంద్రం పింఛను, ఉద్యోగభద్రత లేకుండా చేస్తోందన్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్, విమానాలను అమ్మేసి, బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగులను తొలగించిన కేంద్రం.. ఇప్పుడు ఆర్మీని కూడా ప్రైవేటుపరం చేస్తోందని దునుమాడారు.  

బీజేపీ పాలిత కర్ణాటకలో కరెంట్‌ లేదు.. 
డబుల్‌ ఇంజిన్‌ సర్కారంటూ గొప్పలు పోయే బీజేపీ పాలిత కర్ణాటకలో కరెంట్‌ లేదని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో రూ.రెండు వేలు పింఛను ఇస్తే కర్ణాటకలో రూ.500తో సరిపెడుతున్నారన్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెడితే కేంద్రం ఏటా రూ.ఐదు వేల కోట్లు ఇస్తామంటోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ ఆ నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు.  కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఎందుకు ప్రకటించదని ప్రశ్నించారు. బహిరంగ సభలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, నల్లమడుగు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధీని కూడా కించపరిచిన ఘన చరిత్ర బీజేపీది
‘నల్లచట్టాలను తెచ్చి 750 మంది రైతుల ఉసురుపోసుకున్నారు. సిలిండర్‌ ధరను రూ.400 నుంచి రూ.వెయ్యికి పెంచి మహిళల ఉసురుపోసుకున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యుల ఉసురుపోసుకున్నారు. జీఎస్టీ తెచ్చి వ్యాపారుల ఉసురుపోసుకున్నారు.. ఇప్పుడు అగ్నిపథ్‌ పేరుతో యువత ఉసురు పోసుకుంటున్నారు’అని మోదీ సర్కారుపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

గాడ్సేను వీరుడంటూ గాంధీని కూడా కించపరిచిన ఘన చరిత్ర బీజేపీ ఎంపీలదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. గాడ్సేని వీరుడంటూ బీజేపీ ఎంపీలు మాట్లాడారని, సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఎంపీలపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top