ప్రజాసమస్యలే ‘ఎజెండా’

Telangana: Jagga Reddy Walks Out CLP Meeting Ahead Of The Budget Session - Sakshi

ప్రభుత్వ వైఫల్యాలపై బడ్జెట్‌ సమావేశాల్లో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయం 

గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం సభ్యుల హక్కులను హరించడమే

కోమటిరెడ్డి బ్రదర్స్‌ గైర్హాజరు.. మధ్యలోనే వెళ్లిపోయిన జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్‌ఎస్‌ను అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్‌ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు.

ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్‌లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు.

నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్‌ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్‌ ఇప్పుడు బడ్జెట్‌ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  

కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌: రేవంత్‌ 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్‌ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు.

అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్‌ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు.  

సమన్వయం ఏదీ : సంపత్‌ 
మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్‌ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్‌ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్‌
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలందరూ హైదరాబాద్‌ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top