
వీణవంక: ‘పచ్చని సంసారంలో కేసీఆర్ నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చిన వ్యక్తికి ఓట్లు ఎలా పడతాయి’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ‘కేసీఆర్ బొమ్మతో గెలుస్తామని అనుకుంటున్నారు. ఆ బొమ్మకు ఓటు పడదు. కేసీఆర్ ఆటలు ఇక సాగవు’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం వీణవంక మండలంలోని గంగారం, ఎలబాక, చల్లూరు, మామిడాలపల్లి, ఇప్పలపల్లిలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలసి ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘కేసీఆర్, నీది నిజాం సర్కార్ కాదు. ఇది నీ జాగీరు కాదు. 2023లో టీఆర్‌ఎస్ పార్టీ కథ కంచికే’అని పేర్కొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు టికెట్ ఇప్పించిన వ్యక్తి రాజేందర్, ఆయనను గెలిపించేందుకు ప్రచారానికి కూడా వెళ్లాను, ఇప్పుడు ఆయన కూడా వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నార’ని దాసరి మనోహర్‌రెడ్డిని ఉద్దేశించి ఈటల విమర్శించారు. బిడ్డా.. పెద్దపల్లికి వస్తా కాసుకో.. అని హెచ్చరించారు.