మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్‌.. ఫిట్టింగ్‌ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్‌ | Telangana CM Revanth Reddy Strong Counter To BJP Women Reservations Campaign | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్‌.. ఫిట్టింగ్‌ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్‌

Apr 13 2026 5:02 PM | Updated on Apr 13 2026 5:34 PM

Telangana CM Revanth Reddy Strong Counter To BJP Women Reservations Campaign

సాక్షి, హైదరాబాద్‌: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది.  రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. 

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్‌ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు.  అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్‌ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్‌ ఆరోపించారు.

2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

శిక్షించే హక్కు ఎవరిచ్చారు?
మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.

జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది.  సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్‌డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్‌ నిలదీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement