dilimitation
-
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
ప్రత్యేక దేశంగా ‘సౌత్ ఇండియా’.. ఎమ్మెల్యే గంగుల సెన్సేషనల్ కామెంట్స్
సాక్షి,కరీంనగర్ : దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే కచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనపై స్పందించారు. ప్రత్యేక తెలంగాణా తరహాలోనే ఆ డిమాండ్‌నూ తోసిపుచ్చలేం. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయి. వాటిని సమర్థవంతంగా చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ’ అని వ్యాఖ్యానించారు.డీలిమిటేన్‌కు వ్యతిరేకంజనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది.స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. -
కోరుట్ల..రెవెన్యూ డివిజన్!
ప్రభుత్వ ప్రతిపాదనలు.. నేతలపైనే మెట్పల్లి ఆశలు కోరుట్ల : ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న కోరుట్ల పట్టణం.. త్వరలోనే రెవెన్యూ డివిజన్ హోదా సంతరించుకోనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న జగిత్యాల జిల్లాలో రెండో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కోరుట్ల ఆవిర్భవించనుంది. డివిజన్ కేంద్రాల కోసం కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు కోరుట్లకే మెుగ్గుచూపింది. జనాభా, భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ, ప్రభుత్వ భూముల లభ్యత అంశాలను దృష్టిలో ఉంచుకుని కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కోరుట్ల ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. డివిజన్ స్వరూపం ఇదీ.. కొత్తగా ఏర్పాటయ్యే జగిత్యాల జిల్లా కేంద్రానికి కోరుట్ల 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరుట్ల, మెట్పల్లి అర్బన్, రూరల్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాలు కోరుట్ల డివిజన్లో చేర్చే ప్రతిపాదనలున్నాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు లక్షల పైచిలుకు జనాభా ఉంది. చుట్టుపక్కల ఉన్న మండలాలు అన్నింటికి కోరుట్ల పట్టణం సుమారు 20–25 కిలోమీటర్ల లోపు దూరంలో ఉంటుంది. కోరుట్లలో సుమారు ఎనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. పశువైద్య కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల పరిసరాల్లో డివిజన్ కేంద్రానికి చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీంతోపాటు కోరుట్ల ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణానికి ప్రతిపాదించిన ఎస్సారెస్పీ క్వార్టర్ల సమీపంలో అనుకూలంగా ఉన్న స్థలాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మూడేళ్లుగా ఉద్యమాలు మొదట జిల్లా కేంద్రం కోసం మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉద్యమం మొదలైంది. కరీంనగర్–నిజామాబాద్ జిల్లాలకు మధ్యలో ఉన్న కోరుట్లను జిల్లాగా మార్చాలని అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. సీఎం కేసీఆర్ జగిత్యాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉద్యమ దిశను మార్చుకున్న సాధన సమితి కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం పోరు మొదలెట్టింది. కోరుట్లలో జిల్లా సాధన ఉద్యమం ప్రారంభమైన కొన్నాళ్లకే మెట్పల్లిలో డివిజన్ సాధన కోసం ఉద్యమం ఊపందుకుంది. స్వాతంత్య్రోద్యమం, నిజాం కాలం నుంచి చారిత్రక ప్రాధాన్యత కల్గి ఉండటంతోపాటు భౌగోళికంగా మెట్పల్లి డివిజన్ ఏర్పాటుకు అనుకూలమని సాధన సమితి ప్రతినిధులు ఉద్యమాన్ని ఉధృతంగా సాగించారు. ఈ క్రమంలో ఒకే సెగ్మెంట్లో ఉన్న కోరుట్ల, మెట్పల్లి పట్టణాల మధ్య డివిజన్ కేంద్రం కోసం పోరు మొదలైంది. ఎక్కడిక్కడే ఉద్యమాలు జోరుగా సాగాయి. చివరికి ప్రభుత్వం కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ తీసుకున్న నిర్ణయం మెట్పల్లి ప్రాంత నాయకులు, ప్రజల్లో కొంత నిరుత్సాహాన్ని నింపింది. మెట్పల్లి కోసం నేతలపై ఆశలు కోరుట్ల సెగ్మెంట్లోని కీలక నేతలంతా మెట్‌పల్లికి చెందినవారు కావడంతో రెవెన్యూ డివిజన్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారన్న ఆశల్లో ఆ ప్రాంతవాసులు ఉన్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పునర్విభజన కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధిగా కోరుట్ల సెగ్మెంట్‌కు సంబంధం లేకున్నా మెట్పల్లి పట్టణవాసిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. దీనికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మద్దతు పలికినట్లు ప్రచారం జరుగుతోంది. మెట్‌పల్లికి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనకు కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు రెండు కళ్లవంటివని చెబుతూ డివిజన్ విషయంలో ఏ నిర్ణయాన్నీ ప్రకటించడం లేదు. ఈ సెగ్మెంట్లోని కీలక నేతలంతా మెట్పల్లి వాసులే కావడంతో చివరి నిమిషంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెవెన్యూ డివిజన్ నిర్ణయాన్ని మారుస్తారన్న గట్టి నమ్మకంతో ఆ ప్రాంత వాసులు ఉండటం గమనార్హం. కోరుట్ల ప్రాంత వాసులు మాత్రం అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై వివక్ష చూపి మెట్‌పల్లికి మద్దతుగా మాట్లాడుతున్న నేతలపై మండిపడుతున్నారు. దీంతో కోరుట్ల, మెట్పల్లి ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. నాయకులు సహకరించాలి – చెన్న విశ్వనాథం, కోరుట్ల డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అన్ని అర్హతలున్న కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సెగ్మెంట్ నాయకులు సహకరించాలి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఎంతటి వారైనా సహించం. గతంలో కోరుట్లపై నేతలు వివక్ష చూపారు. కోరుట్లకు రావాల్సిన వసతులన్నింటిని మెట్‌పల్లికి తరలించారు. మళ్లీ డివిజన్ వచ్చే సమయంలో అడ్డుకునే యత్నాలు చేయడం తగదు. మెట్‌పల్లికి ప్రాధాన్యత ఇవ్వాలి – నాంపల్లి గట్టయ్య, మెట్పల్లి డివిజన్ సాధన సమితి అధ్యక్షులు స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి మెట్‌పల్లికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన కాలంలో మెట్పల్లి జిల్లా కేంద్రంగా 130 గ్రామాల్లో పాలన పర్యవేక్షణ జరిగింది. పంచాయితీ సమితిగా, అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా 2009 సంవత్సరం వరకు కొనసాగింది. ఇంతటి చారిత్రక వారసత్వం ఉన్న మెట్పల్లి ప్రస్తుతం సబ్ డివిజన్‌గా ఉంది. అందుకే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.


