మోదీ సర్కార్‌ చేసిందేమీ లేదు.. బీజేపీ వ్యతిరేక కూటమి నాయకత్వంపై స్పందించిన సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Slams Modi Govt At patna Visit - Sakshi

సాక్షి, పాట్నా: అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ దేశానికి చేసిందేం లేదని, పైగా వినాశకర పరిస్థితి తీసుకొచ్చిందని ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. బుధవారం పాట్నాలో బీహార్‌ సీఎం నితీశ్‌ కమార్‌తో భేటీ అనంతరం కేసీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడారు.

దేశంలో పరిస్థితులు ఘోరంగా పడిపోతున్నాయ్‌. కనీసం ఒక్క రంగాన్ని కూడా మోదీ ప్రభుత్వం బాగు చేయలేదు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. ఏ ప్రధాని హయాంలో రూపాయి విలువ పడిపోలేదు. దేశరాజధాని ఢిల్లీలో నీళ్లకు, కరెంట్‌ కొరత నడుస్తోంది. దేశంలో ధరలు, అప్పులు పెరిగిపోయాయి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రం విఫలమైంది. సామాన్యులు, రైతులు.. అన్నీ వర్గాల వాళ్లు ఆందోళనలో ఉన్నారు. మోదీ సర్కార్‌ అసమర్థ  నిర్ణయాలతో దేశంలో తిరోగమనంలో ఉంది.

జాతీయ జెండా సహా అన్నీ.. చివరకు నెయిల్‌కట్టర్‌ కూడా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయ్‌. మోదీ మేకిన్‌ ఇండియా ఎటు పోయింది? చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం?. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలను తుడిచిపెడతామని బీజేపీ అంటోంది. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి. బీజేపీ ముక్త్‌ భారత్‌ సాధించాలి. నితీశ్‌ కూడా ఇదే కోరుకుంటున్నారు అని  సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బంది పెడుతోంది. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ అమ్మేస్తోంది కేంద్రం. అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది. ‘బేచో ఇండియా’ అనేదే బీజేపీ నినాదం. బీజేపీలో అంతా సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తెస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో మోదీ వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ‘అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అనే నినాదం ఎందుకు చేశారు? అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక తాటిపైనే ఉన్నాం. బీజేపీ ‍వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర లేదు. విస్తృతంగా చర్చించాకే నాయకత్వం నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలపై సంచలన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్‌.. సీబీఐ లాంటి ఏజెన్సీలకు రాష్ట్రాల్లో ఏం పని అని.. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలని అన్నారు.

ఇదీ చదవండి: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top