
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. చివరికి అరాచకానికి కూడా తెరలేపింది. ఉప ఎన్నిక గండం గట్టెక్కేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలు బట్టబయలవుతున్నాయి.
ఓటర్ల జాబితా గందరగోళంగా తయారైంది. గతంలో వేసిన పోలింగ్ బూత్‌లను మార్చేసిన అధికారులు.. గ్రామాల్లో ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయలేదు. మొత్తం 15 పోలింగ్ బూత్‌లలోనూ ఓటర్ల జాబితా జంబ్లింగ్ జరిగింది. ఓటింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రల చేస్తున్నారు.
సరిగ్గా 8 ఏళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేతగా.. సీఎంగా చంద్రబాబు లెక్కలేనన్ని కుట్రలు పన్నారు. వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కారు. మోసపు హామీలెన్నో ఇచ్చారు. ఓటర్లకు తాయిలాల ఆశ చూపెట్టారు... వినకుంటే బెదిరించారు. తాజా గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే ఫార్మూలాను అమలు చేస్తున్నారు. వందలాది మందికి ఉద్యోగ జాయినింగ్ లెటర్లు ఇస్తున్నారు. వేలాది మందికి ఏవేవో ఆఫర్లు ఇస్తున్నారు. అయినప్పటీకీ ఇవేవి పనిచేసేలా లేవని ఏకపక్ష పోలింగ్ కోసం చేపట్టాల్సిన చర్యలన్నీ ఎంచుకున్నారు. అదీ కూడా కుదరదంటే ఏకంగా బ్యాలెట్ బాక్సులే మారుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు.
పులివెందుల జెడ్పీటీసీ సీటు ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామంటూ .. టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉద్యోగం కావాలా? జాయినింగ్ లెటర్ రెడీ ఎన్నికల తర్వాత మీ బిడ్డల్ని ఉద్యోగంలో చేర్పించండి. లేదు డబ్బులు కావాలా? గుంప గుత్తగా ఎంతో చెప్పండి ఇస్తాం. అలా కాదంటారా...ఓటుకు వెళ్లొద్దు ఇదో ఇది ఉంచుకోండి. ఇంకా కాదు కూడదంటే బడితె పూజ తప్పదు.. ఇలా పులివెందులలో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో బరి తెగిస్తున్నారు. కుదిరితే ప్రలోభాలతో.. కాదంటే బెదిరింపులతో ముందుకు సాగుతున్నారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన క్రియాశీలక నేతలందర్నీ కట్టడి చేసే ఎత్తుగడను టీడీపీ ఎంచుకుంది. అందుకు వ్యవస్థలు అనుకూలంగా నిలుస్తున్నాయి. పోలింగ్ జనరల్ ఏజెంటు కూడా క్రియాశీలక నేతకు ఇవ్వకూడదనే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి పోలింగ్ జనరల్ ఏజెంటుగా నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. ఆమేరకు అనెగ్జర్–15, ఫారం–11కు ఒరిజనల్ ఆధార్, ఓటరు కార్డు జత చేశారు. శనివారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు లెటర్ పెట్టుకున్నారు.
దీనికి కూడా టీడీపీ నేతల నుంచి క్లియరెన్సు వస్తే తప్ప ఇవ్వమనే దిశగా అధికారులు బాహాటంగా వ్యాఖ్యనిస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు, వ్యవస్థలు అండతో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. వరుస హత్యాయత్నం ఘటనలతో ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న నేపఽథ్యంలో టీడీపీ కేవలం వ్యవస్థల ఆధారంగా పోలింగ్ నిర్వహించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.