పాలిటిక్స్‌లో పిడుగుపాటు.. బీజేపీతో సీఎం నితీశ్‌ కుమార్‌ తెగదెంపులు!

Suspense Over Nitish Kumar Decision On Tie Up With NDA - Sakshi

పట్నా : బిహార్‌లో జేడీ(యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్‌ మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. ఎన్డీయేకి గుడ్‌బై కొట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ దాదాపుగా నిర్ణయించుకున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. జేడీ(యూ)లో సీనియర్‌ నాయకుడు ఆర్‌సీపీ సింగ్‌ గత కొద్ది రోజులుగా బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ నితీశ్‌ వ్యవహారశైలిని నిందిస్తూ వస్తున్నారు. శనివారం ఆయన హఠాత్తుగా పార్టీని వీడడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

మహారాష్ట్రలో శివసేన మాదిరి బిహార్‌లో జేడీ(యూ)లో చీలికలు తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని జేడీ(యూ) నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్‌సీపీ సింగ్‌ మరో ఏక్‌నాథ్‌ షిండేగా మారే అవకాశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.  నితీశ్‌ ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడారని రాష్ట్రంలో తిరిగి ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో ఆయన జత కడతారన్న ప్రచారం సాగుతోంది.  ఎన్డీయే నుంచి జేడీ(యూ) బయటకి వచ్చినప్పటికీ ఆర్‌జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఈ రోజు జరిగే సమావేశంతో దీనిపై ఒక స్పష్టత వస్తుంది. నితీశ్‌ ఎన్డీయే నుంచి బయటకు వస్తే వారితో జత కట్టడానికి తాము సిద్ధమేనని ఆర్‌జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద తివారీ స్పష్టం చేశారు. ఆర్‌జేడీ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

నితీశ్‌ను స్వాగతిస్తాం: ప్రతిపక్షాలు  
బీజేపీ నుంచి దూరమైతే నితీశ్‌కు అండగా నిలుస్తామని బిహార్‌లోని ప్రతిపక్షాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తే స్వాగతిస్తామని కమ్యూనిస్ట్‌ పారీ్టలు వెల్లడించాయి. జేడీ(యూ)కు చేయూతనందిస్తామని 12 మంది ఎమ్మెల్యేలున్న సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌ పేర్కొంది.  నితీశ్‌ను, జేడీ(యూ)తో చేతులు కలపడానికి తాము సిద్ధమేనని ఆర్జేడీ స్పష్టం చేసింది. బీజేపీపై తాము పోరాడుతున్నామని, ఈ పోరాటంలో నితీశ్‌ను కలుపుకొని వెళ్తామని ఆర్జేడీ నేత తివారీ చెప్పారు. బీజేపీతో బంధం తెంచేసుకొని వస్తే జేడీ(యూ)ను సాదరంగా ఆహా్వనిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. ఇదిలా ఉండగా, నితీశ్‌ ఆదివారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాం«దీతో స్వయంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. మంగళవారం జరిగే జేడీ(యూ) ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీలో తదుపరి వ్యూహాన్ని నితీశ్‌ ఖరారు చేయనున్నట్లు సమాచారం.    

ఇది కూడా చదవండి: అమిత్‌ షాను నమ్మలేం.. మరో ఉద్దవ్‌ థాక్రే కావడం ఇష్టం లేకనే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top