
- మహానాడులో లోకేష్ పట్టాభిషేకం
- పెద్ద పదవికి ఎసరెట్టిన చినబాబు
- రికగ్నైజేషన్ కావాల్సిందే అని పట్టుబడుతున్న వైనం
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు.. ఇవన్నీ సరిపోవా ఏమి.. గమ్మున మా చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు మీద కుటుంబం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం..
ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో మే 27.. 28.. 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడులో చినబాబు స్టేచర్ పెరిగిపోవాలి.. లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి.. గిన్నెలు గాల్లోకి లేస్తాయి అనే అల్టిమేటం రావడంతో చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వక తప్పడంలేదు. పోనీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వంటి పదవులు ఇవ్వాలంటే అటు బీజేపీ ఒప్పుకోవాలి.. పవన్ ఊ కొట్టాలి.. ఇవన్నీ అయ్యేది కాదు.. కూటమి ప్రభుత్వంలో ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు సుతరామూ ఒప్పుకోవడం లేదు.
వాస్తవానికి ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ ఇప్పుడు నంబర్ టూ గా ఉంటున్నారు.. పేరుకే చంద్రబాబు కానీ పదవులు.. ప్రాజెక్టులు.. పంచాయతీలు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఎలివేషన్ ఉండాల్సిందే అనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వచ్చేలా లోకేష్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనప్పుడల్లా కొందరితో చంద్రబాబుకు రికమెండ్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు కడప మహానాడులో చినబాబుకు పెద్దపదవిని కట్టబెట్టేపనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
దాదాపుగా తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్..లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవుల్లో ఆయన్ను కూర్చోబెట్టి ఇక పవన్ కళ్యాణ్ కు సరిసమాన హోదా ఇవ్వడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది.. అనే ట్యాగ్ లైన్ మీద హడావుడి చేసే జనసేన నాయకులకు.. క్యాడర్ కు లోకేష్ ఇప్పుడు పోటీగా నిలబడతారని అంటున్నారు.. అప్పుడు లోకేష్ కూడా పవన్ కు సమానమైన హోదా.. గుర్తింపు వస్తుందని. అప్పుడు ఆయన్ను ఎవరూ ఆపలేరని క్యాడర్ సంబరపడుతోంది.
-సిమ్మాదిరప్పన్న