సీఎంకు ఓటర్ల షాక్‌.. మోదీ సూచనతో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మహిళ?

Speculations Ritu Khanduri To Be Nominated As First CM Of Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఓడిపోవడంతో.. పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీకే సీఎం పగ్గాలు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు.. బీజేపీ హైకమాండ్‌ నుంచి రీతు ఖండూరీకి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై అధినాకత్వం రీతూతో చర్చించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆమెనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రీతూ ఖండూరీ భర్త రాజేశ్​ భూషణ్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. 

ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వంలో సీనియర్​ హెల్త్​ సెక్రెటరీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, సీఎం రేసులో మరో ఆరుగురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సత్పాల్‌ మహరాజ్‌, ధన్‌ సింగ్‌ రావత్‌, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, బిషన్‌ సింగ్‌ చుఫాల్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

ఇదిలాఉండగా.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముగ్గురిని సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ఒకరిని, నిర్ణీత సమయంలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున మరొరిని సీఎం పదవుల నుంచి బీజేపీ అధిష్టానం తప్పించింది. చివరగా పుష్కర్‌ సింగ్‌ ధామికి అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సీఎంల మార్పు వ్యవహారం పార్టీని కొంతవరకు ఇబ్బంది పెట్టింది. దీంతో ఈసారి ఎలాంటి తప్పూ దొర్లకుండా ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top