పవన్‌.. వరి ఎలా పండిస్తారో తెలుసా?

Shankar Narayana and Talari Rangaiah Comments On Pawan Kalyan - Sakshi

ఏ సీజన్‌లో ఏ పంట వేయాలో తెలుసా? 

ప్యాకేజీలు తీసుకుని మాట్లాడడం తగదు 

జగన్‌ ప్రభుత్వం ఎంత మేలు చేసిందో తెలుసుకో 

మాజీ మంత్రి శంకరనారాయణ, ఎంపీ రంగయ్య ధ్వజం

పెనుకొండ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. రైతాంగానికి, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి చేసిందో తెలుసుకోవాలని సూచించారు. బుధవారం వారు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. కౌలు రైతుల పరామర్శ పేరుతో పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు. వేరుశనగ, వరి ఎలా పండిస్తారో.. ఏ సీజన్‌లో ఏ పంట వేస్తారో పవన్‌కు తెలుసా? అని నిలదీశారు. పవన్‌కల్యాణ్‌ ఏ రైతు కుటుంబాలను పరామర్శించారో ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించిందని, ఈ విషయాన్ని ఆయన తెలుసుకోకపోవడం శోచనీయమన్నారు. 

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్సంకల్పంతో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. పీఎం కిసాన్‌ పథకంతో కలిపి ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకూ అవే రాయితీలు ఇస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువులు, పంట నష్టపరిహారం, ఉచిత ఇన్సూరెన్స్‌ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలను రైతుల కోసం వైఎస్‌ జగన్‌ సర్కారు అమలు చేస్తోందని, వీటి గురించి తెలుసుకోకపోవడం పవన్‌ కల్యాణ్‌ అవివేకమని విమర్శించారు. వారు ఇంకా ఏమన్నారంటే.. 

ప్యాకేజీ మాటలవి.. 
► రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టని పవన్‌ కల్యాణ్‌.. ప్యాకేజీ తీసుకుని, వారు ఎలా చెబితే అలా ఆడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 739 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 469 మందికి పరిహారం ఇవ్వలేదు. జగన్‌ సీఎం అయ్యాక వీరికి రూ.23.45 కోట్లు పరిహారం అందించారు. 
► 2020లో 308 మంది చనిపోగా, ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున రూ.21.56 కోట్లు, ఆ తర్వాత ఏడాది 263 మంది చనిపోగా, రూ.18.41 కోట్లు, అనంతర కాలంలో 125 మంది చనిపోగా రూ.8.75 కోట్లు చెల్లించారు. మొత్తమ్మీద రూ.72 కోట్లు ఇచ్చారు. ఈ విషయాలు తెలుసుకోకుండా పవన్‌ ఇష్టానుసారం మాట్లాడటం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం.  
► 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పక్షాన ఉన్న పవన్‌కల్యాణ్‌.. ఆనాడు 739 మంది రైతులు చనిపోతే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అప్పుడు గాడిదలు కాస్తున్నారా? ఈయనకు స్పష్టమైన మేనిఫెస్టో లేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఊపడమే ఆయన నైజం.   
► జగన్‌ సీఎం అయ్యాక రైతులతో సమానంగా కౌలు రైతులకూ ప్రయోజనాలు అందిస్తున్నారు. పంట సాగుదారులకు రక్షణగా చట్టం తెచ్చారు. 1.82 లక్షల మంది కౌలు రైతులకు రూ. 1,176 కోట్ల పంట రుణాలు అందించారు. 5.24 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రాయితీలు వర్తింపజేశారు. రైతు భరోసా ద్వారా అన్ని రకాల రైతులను ఆదుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top