చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

అధికారులకు లేఖలు రాయడమేంటి?

ప్రజలెక్కడ మరచిపోతారోనన్న భయం

అధికారయావ తప్ప మరోటి లేదా?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వానికి కాకుండా డీజీపీ వంటి అధికారులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాయడమేంటి? లిటిగెంట్‌ మనస్తత్వంతోనే ఆయన ఇలా చేస్తున్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలిలా ఉన్నాయి..  

► ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరాటం చేస్తాయి. వైఫల్యాలు ఎక్కడున్నాయో చెబుతాయి. కానీ చంద్రబాబు వైఖరి విచిత్రంగా ఉంది. నిజమైన ప్రతిపక్షం ఎలా ఉండాలనేది ఆయనకు తెలిసినట్లు లేదు. ఆయనకు తెలిసిందల్లా ఏదో రకంగా అధికారంలో ఉండాలనేదే అన్న విధంగా ఉంది.
► వామపక్షాలు, బీజేపీ, ఇతర పార్టీలు ముఖ్యమంత్రికే సమస్యలపై లేఖలు రాసేవి. కానీ అజ్ఞాత వాసిగా పక్క రాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు సోమవారం డీజీపీకి ఎందుకు లేఖ రాశారు? లేఖలకు డీజీపీ స్పందించాలన్నా, మళ్లీ చంద్రబాబును ఏదైనా అడగాలన్నా.. వారి రూల్‌బుక్‌ ఒప్పుకోదనుకుంటా. ఆ అధికారి తిరిగి ప్రశ్నించడం కూడా చూసే వారికి బాగుండదు.
► చంద్రబాబు అంతకు ముందు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖలను తీసుకుని లిటిగెంట్‌ మనస్తత్వంతో కోర్టులకు వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నట్టుంది. పది, పదిహేను లేఖలు రాస్తే ఇది విఫలమైన వ్యవస్థ అని ప్రజలు అనుకుంటారని  భావిస్తున్నారు.

రేపు ఆర్డీవోలు, ఎమ్మార్వోలకూ రాస్తారు
► ఇవాళ చంద్రబాబు రాసిన లేఖ చాలా దారుణంగా ఉంది. చంద్రబాబు మాట ఆయనే వినరనుకుంటా. మొన్నామధ్య చంద్రబాబు అభ్యంతరాలకు డీజీపీ సమాధానమిస్తూ లేఖ రాస్తే.. ‘ఆయనెవరు నాకు లేఖ రాయడానికి’ అని మండిపడ్డారు. ఇప్పుడూ అదే డీజీపీకి లేఖ రాయడమేంటి? రేపు ఆర్డీవో లు, ఎమ్మార్వోలకు రాసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 
► చంద్రబాబు ప్రజల్లో లేరు. హైదరాబాద్‌లో కూర్చొన్నందున ఎక్కడ తనను ప్రజలు మరచిపోతారోనని అధికారులకు లేఖలు రాయడం మొదలు పెట్టారు. ఆ లేఖలపై టీవీ చానళ్లలో స్క్రోలింగ్‌లు చూసుకుని మురిసిపోతున్నారు. 
► పోలీసు శాఖను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని ఆయన ఒక మాఫియాలా నడిపారు కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా అలానే చేస్తారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నట్లున్నారు. కేసులో ఎవరున్నా మీ డ్యూటీ మీరు చేయండని తొలి సమావేశంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ పోలీసులకు దిశా నిర్దేశం చేయడం అందరికీ తెలుసు. 
► కోవిడ్‌ను సమర్థవంతంగా ఏపీ ఎదుర్కొంటోందని సర్వత్రా ప్రశంసలు వస్తోంటే కోవిడ్‌పై మాకు సమాచారం ఇవ్వండని టీడీపీ వెబ్‌సైట్‌ ప్రారంభించడం ఏమిటి.. జోక్‌ కాక పోతే!     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top