టీఆర్‌ఎస్‌ బలం, బలహీనత నాయకులే!

Political Heat In Telangana State - Sakshi

తెలంగాణలో మూడోసారి అధికారం తమదే అని గులాబీ దళం ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచి గోల్కొండ కోట మీద జెండా ఎగరేస్తామంటోంది కాషాయ సేన. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ హస్తగతం అవుతుందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీఠం ఎవరికి దక్కబోతోందనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువున్నా.. పార్టీలు, నేతల హడావిడి చూస్తే మాత్రం ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసినట్లే అనిపిస్తోంది.

ఇక తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్లు సర్వే సంస్థలు కూడా ముందస్తుగా జ్యోతిష్యాలు చేప్పేస్తున్నాయి. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం...పార్టీ జాతీయ నేతలంతా ఇక్కడకు రావడంతో తెలంగాణా బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. ఇక మోదీని ఎదిరించేంది కేసీఆర్ మాత్రమే అన్నట్లు జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. మరోవైపు తెలంగాణాలో పీసీసీ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి పార్టీని నిలబెడతానంటూ తొడగొడుతున్నారు. 

రాష్ట్రంలో ఊపందుకున్న రాజకీయ హడావుడి చూస్తుంటే..అన్ని పార్టీలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీలు పోటీలు పడి మరీ ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతున్నాయి. ఇతర పార్టీల నుంచి ఎంత ఎక్కువ మంది నాయకులు తమ పార్టీలో చేరితే అంత బలం వచ్చినట్లు ఫీల్ అవుతున్నాయి. ఇందులో కొంత  వాస్తవం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం తెలంగాణాలో మూడుముక్కలాట జోరుగా నడుస్తోంది. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణాలో దేనికదే తమ పార్టీయే బలమైన శక్తిగా భావిస్తోంది. అయితే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు. 

2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను గులాబీ దళం తమ పార్టీలో చేర్చుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాల నేతలను టీఆర్ఎస్‌ వదల్లేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకులంతా ఇప్పుడు గులాబీ గూటిలోనే ఉన్నారు. ఇలా ప్రతీ జిల్లాలోనూ టీఆర్‌ఎస్ పార్టీ హౌజ్‌ఫుల్ అయ్యింది. తెలంగాణాలోని ముఖ్య పార్టీల్లోని సీనియర్ నేతలు ఎక్కువ మంది టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర సమితి బలమైన నాయకత్వంతో కనిపిస్తోంది. అధికారం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఅర్ఎస్ హవా కొనసాగింది. గులాబీ పార్టీకి గ్రామస్థాయి నుంచి బలమైన నాయకులున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం నాయకులే... బలహీనత కూడా నాయకులే.

ఇక్కడ చదవండి: ముందస్తా? పార్టీ మారతారా? తుమ్మల హాట్‌కామెంట్స్‌పై చర్చ

రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులపై కాంగ్రెస్‌ వేటు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top