
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం
బీజేపీ ‘విజయ సంకల్ప యాత్ర’ బహిరంగ సభలో ప్రసంగం
రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ పరస్పరం ‘కవర్ ఫైర్’ చేసుకుంటున్నాయి
ఈ రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది
బీఆర్‌ఎస్ కుంభకోణాల్లో కాంగ్రెస్ భాగస్వామి అయ్యింది
కాళేశ్వరంపై విచారణ జరిపించకుండా రాష్ట్ర సర్కార్ ఫైళ్లు మూసేసింది
ఈ రెండు పార్టీల ‘కవర్ ఫైర్’ ఎక్కువ రోజులు సాగబోదు
ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ సర్కార్ ‘ఎయిర్ స్ట్రైక్’ కూడా చేస్తుంది
ఇందుకు ప్రజల సహకారం కావాలి.. 400 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి
తెలంగాణ ప్రజల ప్రేమను అభివృద్ధి రూపంలో రెండింతలు చేసి తిరిగి ఇస్తా
కుటుంబ పార్టీల అవినీతి బయటపెడుతున్నందుకు కాంగ్రెస్ నాకు శాపనార్థాలు పెడుతోంది
దేశ హితం కోసం మోదీ తనను తాను సమర్పించుకుంటున్నాడంటూ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంగా తయారైందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ పరస్పరం ‘కవర్ ఫైర్’ చేసుకుంటున్నాయని విమర్శించారు. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది. దీని గురించి ప్రపంచం అంతా తెలుసు. మీరు తిన్నారు.. మేం కూడా తింటాం అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండిటిదీ ఒకే బాట.. అదే అబద్ధాలు.. దోపిడీ (ఝూట్.. లూట్)..’ అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంలో అవినీతికి పాల్పడి రైతుల నుంచి బీఆర్‌ఎస్ సర్కార్ వేల కోట్లు దోచుకుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణ జరిపించకుండా మౌనం వహించడమే కాకుండా దానికి సంబంధించిన ఫైళ్లు మూసేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కుంభకోణాల్లో కాంగ్రెస్ భాగస్వామి అయ్యిందని అన్నారు. ఈ రెండు పార్టీల ‘కవర్ ఫైర్’ ఎక్కువ రోజులు సాగబోదని, ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ ప్రభుత్వం.. ‘ఎయిర్ స్ట్రైక్’ కూడా చేస్తుందని హెచ్చరించారు.
అయితే అందుకు ప్రజల పూర్తి ఆశీర్వాదం కావాలని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేలా, దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షం 400 స్థానాలకు మించి గెలిచేలా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. (నాలుగు వందల సీట్లు దాటాలి. బీజేపీకి ఓటు వేయాలి అంటూ తెలుగులో పిలుపునిచ్చారు) మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. అనంతరం విడిగా ఏర్పాటు చేసిన బీజేపీ ‘విజయ సంకల్ప యాత్ర’ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగులో ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు’ అంటూ ప్రసంగం ప్రారంభించారు.
నేను చెప్పానంటే తప్పకుండా చేసి చూపిస్తా
‘తెలంగాణ ప్రజల ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలను తెలంగాణ అభివృద్ధి రూపంలో రెండింతలు చేసి తిరిగి ఇచ్చేస్తా. ఇది మోదీ గ్యారంటీ. నేను ఏదైనా చెప్పానంటే దానిని తప్పకుండా చేసి చూపిస్తాం. మనందరం కలిసి భారత్‌ను ప్రపంచంలోనే కొత్త శిఖరాలకు తీసుకెళదాం. తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బాగా ఆదరిస్తున్నారు.
మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను. మోదీ గ్యారెంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారెంటీ. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అయోధ్యలోని భవ్య మందిరంలో శ్రీరాముడికి స్వాగతం పలికాం. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికశక్తిగా మన దేశం మారింది. ఆర్థిక ప్రగతిలో మన దేశం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పి, దానిని నిజం చేసి చూపాం..’ అని మోదీ అన్నారు.
మూడేళ్లలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
‘ఇప్పుడు మరో గ్యారంటీ ఇస్తున్నా..రాసుకోండి. వచ్చే మూడేళ్లలో విశ్వంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేలా చేస్తాం. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే హామీ. (ఈ వాక్యాన్ని తెలుగులో ఉచ్ఛరించారు. దీంతో పలువురు సభికులు ‘మోదీ మోదీ’ అని పెద్దపెట్టున హర్షధ్వానాలు చేస్తూ నినదించారు. తెలంగాణ ప్రజలు తామే మోదీ కుటుంబమని చెబుతున్నారంటూ ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. మేమే మోదీ కుటుంబం అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు). సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ద్వారా మేము అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం..’ అని ప్రధాని తెలిపారు.
తెలంగాణకు ఎక్కువ నిధులు
‘తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. వేలాది కోట్లు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై పెడుతున్నాం. వీటి వల్ల తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వారి స్వప్నాలు సాకారమవుతాయి. రాష్ట్ర ప్రజల స్వప్నాలను, మోదీ కుటుంబసభ్యుల కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ముందుకెళుతున్నాం. మహిళలు, దళితులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల వారికి వివిథ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణలోని రైతుల నుంచి గత పదేళ్లలో ధాన్యం, పత్తి పెద్దమొత్తంలో కొనుగోలు చేశాం. రాష్ట్రంలోని 40 లక్షలకు పైగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనం చేకూరింది..’ అని మోదీ చెప్పారు.
నాకు కుటుంబం లేదంటున్నారు..
‘దేశ ప్రజలు, వారి కుటుంబాలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలుకు నేను చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ, వారి మిత్ర పక్షాలు నన్ను, నా కుటుంబాన్ని తిడుతున్నాయి. శాపనార్థాలు పెడుతున్నాయి. మోదీని, ఆయన కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నారు? వాళ్ల కళ్లు ఎందుకు ఎర్రబడుతున్నాయి? నేను వారి రూ.వేలు, లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి గుట్టును విప్పుతున్నందుకు అంత ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కశీ్మర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీల పాలన కొనసాగుతోంది. ఎక్కడెక్కడైతే కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నాయో అక్కడ వారి పరివారాలు ఆర్జనలో బలోపేతమై, రాష్ట్రాలు మాత్రం బలహీనమై పోయాయి.
కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? ఒక ముఖ్యమంత్రి కుటుంబం, దగ్గరి బంధువుల్లో 50 మంది ఉన్నతస్థానాల్లో ఆసీనులయ్యారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేను గళమెత్తితే...నా ప్రశ్నలకు బదులివ్వకుండా మోదీకి కుటుంబమే లేదంటూ విరుచుకుపడుతున్నారు. వీరి కుటుంబ, పరివారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గట్టిగా గొంతు విప్పి చర్యలు తీసుకోవడం సరైనదేనా? (సభికులు అవును అంటూ కేకలు వేశారు)’ అని మోదీ అడిగారు.
140 కోట్ల ప్రజలే నా కుటుంబసభ్యులు
‘కుటుంబ పార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరివార వాద పార్టీగా మారాక 50 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్న వారిని ముందుకెళ్లకుండా అడ్డుకుంది. ఏదైనా పదవిలో కూర్చోబెట్టాలంటే 80, 85 ఏళ్లు దాటిన వారిని తీసుకొస్తున్నారు. యాభై ఏళ్లలోపు వారు వస్తే తమను ఓవర్‌టేక్ చేస్తారనే భయం వారిని పట్టుకుంది. వారికి వారి కుటుంబమే సర్వస్వం. దీనికి భిన్నంగా దేశంలోని ప్రతి కుటుంబం నాదే.
140 కోట్ల ప్రజలే నా కుటుంబసభ్యులు. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి, యువత నా కుటుంబమే. కాంగ్రెస్, ఇండి కూటమికి ఇది అర్థం కావడంలేదు. వారికి వారి కుటుంబప్రయోజనాలే ముఖ్యమైతే నాకు దేశ హితమే సర్వస్వం. వారు తమ కుటుంబ ప్రయోజనాల కోసం దేశహితాన్ని బలిపీఠం ఎక్కించారు. మోదీ మాత్రం దేశ హితం కోసం తనను తాను సమర్పించుకుంటున్నాడు..’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
నా సంపాదన ప్రజలకే ఖర్చు చేస్తున్నా..
‘దేశ రాజకీయాల్లోకి నీతివంతమైన యువతను తీసుకురావాల్సిన అవసరం ఉంది. నాకు అవకాశం దొరికినపుడు, గతంలో సీఎంగా ఉన్నపుడు, ఇప్పుడు నా సంపాదన నుంచి ప్రజల కోసం ఖర్చు చేశా. దానాలు చేశా. పేద పిల్లల చదువులకు కేటాయించా. కుటుంబ రాజకీయాలు చేసేవారు అధికారంలో ఉన్నపుడు వచ్చిన బహుమానాలను సొంతంగా వాడుకున్నారు. తాము సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. నేను మాత్రం గుజరాత్ సీఎంగా, దేశ పీఎంగా వచ్చిన ఇలాంటి గిఫ్ట్‌లను ఒక భాండాగారంలో భద్రపరిచి, తర్వాత వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగమ్మ తల్లి సేవలో ఖర్చు చేస్తున్నా.
మీ సేవకుడిగా దాదాపు రూ.150 కోట్లు ప్రజల సేవలో ఖర్చు చేశా. నేను కూడా పరివార వాదిని అయితే ఈ సొమ్మంతటినీ సొంతానికి తీసుకునేవాడిని. మీరు నా కుటుంబసభ్యులు. మీ గౌరవాన్ని తగ్గించి తలదించుకునే పని ఎప్పటికీ చేయను. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు కట్టించారు. మోదీ ఇంతవరకు సొంతానికి ఒక్క ఇల్లు కూడా కట్టించుకోలేదు. కానీ దేశంలో పేదలకు మాత్రం 4 కోట్ల ఇళ్లు కట్టించాం. అందుకే కోట్లాది మంది ప్రజలు తాము మోదీ కుటుంబ సభ్యులమని అంటున్నారు..’ అని మోదీ తెలిపారు.