సాక్షి, న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయని అన్నారు.
శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయి. కోట్ల మంది మహిళలకు విపక్షాలు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆ పార్టీలు శిక్ష అనుభవించక తప్పదు’’ అని అన్నారు.
పండుగ చేసుకుంటున్నారా?: కిరణ్ రిజిజు
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ఘోరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపాం. అయినా అడ్డుకున్నారు. మహిళా బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవడం దుర్మార్గం. ఈ బిల్లు ఎలా అప్రజాస్వామికమో రాహుల్ గాంధీ చెప్పాలి అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.
మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్ సంబంధిత మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ సవరణ-131పై లోక్‌సభలో ఓటింగ్ జరగ్గా మెజారిటీ చేరుకోలేక ఆ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే.
మహిళా రిజర్వేషన్లకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని.. ఎన్డీయే ప్రభుత్వం రాజకీయానికి దిగిందని.. డీలిమిటేషన్ అంశాన్ని ఈ రిజర్వేషన్లతో ముడిపెట్టడంతోనే ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. అయితే డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని.. మహిళా రిజర్వేషన్ల విషయంలో తాము చిత్తశుద్ధితోనే వ్యవహరించామని ఇటు కేంద్రం అంటోంది.


