మోదీ నమస్కారం వైరల్‌.. ఎవరీ రవీందర్‌? | PM Modi bowed Candidate Ravinder Singh Negi In Delhi election rally | Sakshi
Sakshi News home page

మోదీ నమస్కారం వైరల్‌.. ఎవరీ రవీందర్‌?

Jan 30 2025 5:15 PM | Updated on Jan 30 2025 6:40 PM

PM Modi bowed Candidate Ravinder Singh Negi In Delhi election rally

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్క్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీలో బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ నేగి.. మోదీ పాదాలకు నమస్కరించడంతో ప్రతిగా మర్యాదతో ప్రధాని కూడా మూడుసార్లు నమస్కరించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రవీందర్‌ సింగ్‌ నేగి ఎవరూ అనే చర్చ మొదలైంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రవీందర్‌ సింగ్‌ నేగి.. పట్పర్‌గంజ్‌ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆప్‌ అభ్యర్థిగా యూపీఎస్సీ కోచ్‌ అవధ్‌ ఓజా పోటీలో నిలిచారు. ఇదే స్థానం నుంచి ఆప్‌ సీనియర్‌ నాయకుడు మనీష్‌ సిసోడియా 2013 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం సిసోడియా జంగ్‌పురా నుండి పోటీ చేస్తున్నారు. ఇక, రవీందర్‌ సింగ్‌ నేగి ప్రస్తుతం పట్పర్‌గంజ్‌ నియోజకవర్గంలో భాగమైన వినోద్‌ నగర్‌ నుంచి కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా.. రవీందర్‌ సింగ్‌ నేగి అప్పట్లో సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయ్యారు. అయితే, ఢిల్లీలో దుకాణాలకు తమ సొంత పేర్లను ఏర్పాటు చేయాలని నేగి సూచించారు. హిందువులు అయితే కాషాయ జెండాను దుకాణాలపై ఎగురువేయాలని కోరారు. అంతేకాకుండా.. నవరాత్రి రోజుల్లో, పండుగలకు ముందు రోజు హిందూ భావాలను గౌరవిస్తూ మటన్‌, చికెన్‌ షాపులను మూసివేయాలని దూకాణాదారులను ఆయన కోరారు. దీనికి సంబంధించిన వీడియోలు అక్టోబర్ 2024, జనవరి 2025లో సోషల్‌ మీడియాలో కనిపించాయి. దీంతో, హిందువుల గురించి ఆయన పలు కార్యకక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, ఢిల్లీలో వరద నీరు నిలిచిన సమయంలో నీటిలో బోట్లు వేసుకుని తిరిగారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఆయన కార్యక్రమాలు వైరల్‌గా మారాయి.

మరోవైపు.. రవీందర్‌ సింగ్‌ నేగి బీజేపీ నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఆయన మనీష్ సిసోడియా చేతిలో కేవలం 2 శాతం తేడాతో ఓడిపోయారు. 2022 ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో, వినోద్ నగర్ స్థానం నుండి ఆప్‌ అభ్యర్థిని 2,311 ఓట్ల తేడాతో ఓడించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement