జన సంద్రం.. సర్వం జగనన్న మంత్రం 

People who competed to meet CM Jagan - Sakshi

ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ సభకు బ్రహ్మరథం 

మండుటెండను సైతం లెక్క చేయని ప్రజలు  

అడుగడుగునా నీరా‘జనాలు’  

రోడ్లపై పూలు చల్లి హారతులిచ్చిన అక్కచెల్లెమ్మలు  

జై జగన్‌ నినాదాలతో హోరెత్తిన రోడ్‌ షో  

సీఎం జగన్‌ను కలిసేందుకు పోటీ పడ్డ జనం  

ఆ సామిని ఓసారి చూద్దామని..
ఉదయం 11:30 గంటలు.. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. పైన భానుడి భగభగ, కింద రోడ్డు సెగ.. వీటన్నింటినీ లెక్క చేయకుండా ఇద్దరు అవ్వలు అనంతపురం – చెన్నై జాతీయ రహ­దారిపై మొలకలచెరువు నుంచి మదనపల్లెకు వచ్చే వాహనాలను ఆపి.. ‘మా పెద్ద కొడుకు ఎంత వరకు వచ్చారు?’ అంటూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ‘ఏం అవ్వా.. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు’ అని అడగ్గా.. ‘మాది ఇక్కడికి కిలోమీటర్‌ దూరంలో ఉండే ఆవులవారిపల్లె.

ఈ రోడ్డులో సీఎం వైఎస్‌ జగన్‌ వస్తున్నారని ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎదురు చూస్తున్నాం’ అని బదులిచ్చారు. ఇంత ఎండలో మీరెందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించగా.. ‘రూ. మూడు వేల పెన్షన్‌ ఒకటో తేదీ ఉదయాన్నే మా గుమ్మం దగ్గరకు పంపాడు.

కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల యోగక్షేమాలు పట్టించుకోని ఈ రోజుల్లో మాలాంటి పండుటాకుల కష్టాలను గుర్తెరిగి వలంటీర్‌ల ద్వారా పెన్షన్‌ ఇంటికి పంపి అండగా ఉన్నాడు. కంటివెలుగు పథకంతో మా కళ్లకు మసకలు తొలగించాడు. మా ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాడు. ఇంత చేసిన ఆ సామిని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తున్నాం’ అని బదులిచ్చారు.

(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
సీఎం వైఎస్‌ జగన్‌ ద్వారా లబ్ధి పొందిన వారితో అనంతపురం – చెన్నై జాతీయ రహదారి మంగళవారం కిక్కిరిసింది. తమకు మేలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ను ఓ సారి చూద్దామని.. వీలైతే ఆయనను కలుద్దామని.. కుదిరితే మాట్లాడదామని ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో అన్నమయ్య జిల్లా ప్రజలు పోటెత్తారు. మదనపల్లె జనసంద్రాన్ని తలపించింది. తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రజలు వైఎస్‌ జగన్‌కు జై కొట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా చీకటిమానిపల్లెలో ఏర్పాటు చేసిన బస కేంద్రం నుంచి ఉదయం 10:25 గంటలకు సీఎం జగన్‌ రోడ్‌షో ప్రారంభించారు. కూత వేటు దూరంలోనే అన్న­మయ్య జిల్లాలోకి ప్రవేశిస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ములకలచెరువులో భారీ గజమాలతో సీఎంను ప్రజలు సత్కరించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనానికి అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు.

పెద్దపాళ్యం గ్రామంలో హారతులు పట్టి మహిళలు స్వాగతం పలికారు. బస్సు దిగి సీఎం జగన్‌ మహిళలు, వృద్ధులను పలుకరించి, వారికి ఏమైనా సమస్యలున్నాయోమోనని ఆరా తీశారు. మదన­పల్లెకు వెళ్లే మార్గమధ్యలో వేపూరికోట, తుమ్మనంగుట్టల్లో రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనంతో బస్సు దిగి మరీ సీఎం మాట్లాడారు. పెద్దపల్లి క్రాస్‌ వద్ద రోడ్డంతా బంతిపూలు చల్లి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

అక్కున చేర్చుకున్న ‘అంగళ్లు’
58 నెలల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కుకుని, ఆత్మ గౌరవంతో జీవించడానికి చేదోడుగా నిలిచిన సీఎం జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 35 డిగ్రీలకు పైగా ఎండను లెక్క చేయకుండా అంగళ్లులో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతనను చూడటానికి పోటీపడ్డారు.

అంగళ్లు గ్రామంలోకి ప్రవేశి­స్తున్న సీఎం జగన్‌కు హారతులు పట్టి పూల వర్షం కురిపించారు. భారీ గజమాలతో సత్కరించారు. భారీ జనసందోహం మధ్య అంగళ్లులో బస్సుపైకి ఎక్కి సీఎం రోడ్‌షో నిర్వహించారు. మధ్యాహ్నం 1.40 గంటల  నుంచి  అరగంటకుపైగానే సీఎం అంగళ్లులో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అంగళ్లు శివారులోని విశ్వం కాలేజీ వద్ద భోజన విరామ శిబిరానికి చేరుకున్నారు. భోజన విరామ శిబిరం నుంచి సాయంత్రం 4.10 గంటలకు సీఎం జగన్‌ మదనపల్లె వైపు బయలుదేరారు. అమ్మచెరువుమిట్ట వద్ద మదనపల్లె నాయకులు సీఎం జగన్‌కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు.

పోటెత్తిన జన సందోహం మధ్య అక్కడి నుంచి రోడ్‌షో మదనపల్లె వైపునకు సాగింది. పెద్ద ఎత్తున కదలివచ్చిన జనం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన నినాదాలు హోరెత్తించాయి. టిప్పు సుల్తాన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు 5 కి.మీ మేర దూరంలో రోడ్‌షో ముగియడానికి 1.30 గంటలకు పైగా సమయం పట్టింది. మదనపల్లె టిప్పు సుల్తాన్‌ మైదానంలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ సూపర్‌ సక్సెస్‌ అయింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభం అవ్వాల్సి ఉండగా, మధ్యా­హ్నం 12 గంటల నుంచే ప్రజలు గ్యాల­రీల్లోకి చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకా­రం సీఎం సభ ప్రాంగణానికి చేరుకు­నే­లోపే మైదానం మొత్తం నిండి­పోయి, బయట రోడ్డుపైనాజనా­లు పోటె­త్తారు. 

మంగళవారం రాత్రి అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర ముగించుకుని పుంగనూరు మండలం కృష్ణాపురం వద్ద చిత్తూరు జిల్లాలోకి సీఎం జగన్‌ ప్రవేశించారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలు, నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి బోయకొండ క్రాస్‌కు వెళ్లే మార్గంలో ప్రజలు చీకట్లో కూడా రహదారిపైకి చేరుకుని సీఎంను కలిశారు. మహిళలు, చిన్నారులు, వృద్దులు పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఇక్కడ బస్‌ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. అనంతరం చౌడేపల్లిలో సీఎం రోడ్‌ షో నిర్వహించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోమాల మండలం అమ్మగారిపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.  

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top