బాబు గారడీ మాటలకూ చేతలకు పొంతనలేదు | People Are Suffering Due To Chandrababu Fake Promises | Sakshi
Sakshi News home page

బాబు గారడీ మాటలకూ చేతలకు పొంతనలేదు

May 23 2025 9:47 PM | Updated on May 23 2025 9:50 PM

People Are Suffering Due To Chandrababu Fake Promises

ఊళ్లు వలసెళ్లిపోతున్నాయి..

గ్రామాల్లో పనుల్లేవు పైసల్లేవు..

ఎక్కడా కాణీ కదలడం లేదు

వలసబాట పట్టిన 12 లక్షల కుటుంబాలు 

ఊళ్లలో పరిస్థితులు బాలేవు.. ఎక్కడా పైసా రాలడం లేదు.. చిన్న వ్యాపారాలు సాగడం లేదు.. ఆఖరుకు ఉపాధి హామీ పనులల్లో చేరి జాబ్ కార్డు తీసుకుని చెరువుపనులు చేస్తున్నా వేతనాలు రావడంలేదు. ప్రభుత్వం నుంచి కూడా రూపాయి లేదు. పిల్లాబిడ్డలతో ఎలా బతికేది. ఇక ఇక్కడ బతకడం కష్టమే.. పైదేశం పొతే అక్కడైనా తల్లినాలుగురం కూలీ నాలీ చేసుకుని కలోగంజో తాగొచ్చు.. పోదాం పదండి.. ఇదీ సగటు పేద కుటుంబంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ... ఎప్పుడూ జరిగేదే ఈసారి కూడా జరుగుతోంది.

ఎన్నికలకు ముందు రకరకాల రంగురంగుల కరపత్రాలతో జనాన్ని నమ్మించి గెలిచి, తరువాత వారికి రంగుల చిత్రం చూపడం చంద్రబాబు నైజం. అయన గెలిచాక అయన అనుచరులు.. వందిమాగధులు బాగుంటారు.. రాష్ట్రం మొత్తం పస్తులుంటుంది. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వస్తూనే వాలంటీర్లు ఓ రెండులక్షలమందిని తీసేసారు.. అంటే ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఆధారంగా ఉన్న చిన్న ఆదాయం పోయినట్లే.. ఇప్పుడు తాజాగా రేషన్ బళ్ళను సైతం తీసేస్తున్నారు.. వీళ్ళొక పదివేలమంది.  ఇలా రకరకాల శాఖల్లో వేలాదిమందికి ఉపాధికి గండి పడుతోంది. కొత్తగా పరిశ్రమలు రావడం మాట అటుంచి ఎక్కడికక్కడ చిన్న పరిశ్రమలు.. కుటీర పరిశ్రమలు మూతబడుతున్నాయి.  

ఊళ్లో ఏదో చిన్నా చితకా టీ  దుకాణం పెట్టుకుందాం అంటే అవి కూడా సరిగా నడవడం లేదు. ఇంకేదైనా పెడదాం అన్నా డబ్బుల్లేవు.. నా దగ్గరే కాదు జనం దగ్గర పైసలు లేవు... ఎవరూ కాస్త ధారాళంగా వందనోటు మార్చేందుకు ధైర్యం చేయడం లేదు.. అవసరం అంటేనే ఆచితూచి మూడుసార్లు ఆలోచించి జేబులోంచి నోటు తీస్తున్నారు.. ఇక ఇక్కడ అందరిమధ్యా ఉంటూ పస్తులుండడం మేలన్న భావనకు వచ్చేసిన పెదాబిక్కీ జనం మద్రాస్.. ముంబై.. హైదరాబాద్.. విజయవాడ ఇలా ఎక్కడ పనిదొరికితే అక్కడికి కడుపు చేతబట్టుకుని వెళ్లిపోతున్నారు.

రాయలసీమనుంచి ఎక్కువగా మద్రాస్.. బెంగళూర్ వంటి నగరాలకు చేరుతున్నారు. పాలనలోకొచ్చి ఏడాదైంది కదా తమ వీరత్వం గురించి జనం ఏమనుకుంటున్నారో అన్నది తెలుసుకునేందుకు గ్రామా సచివాలయాల ద్వారా సర్వ్ చేయించిన ప్రభుత్వానికి షాకిచ్చే ఫలితాలొచ్చాయి. ఈ ఏడాదిలో అక్షరాలా 12 లక్షలమంది జనం ఊళ్లొదిలి అన్నాన్ని వెళ్లిపోయారట. ఉన్నఊళ్ళో కష్టమో సుఖమో అందరిమధ్యా ఉందామనుకున్న వాళ్ళను సైతం ఈ చేతగాని సర్కారు ఉండనీయడం లేదు.

ఇక్కడ ఉంటె గుక్కెడు గంజి.. పిడికెడు మెతుకులు కూడా దొరికే ఛాన్స్ లేదు. పోనీ ప్రభుత్వం అయినా ఏదో పథకం కింద పావలా ఇస్తుందనుకుంటే పన్నులు.. చార్జీల రూపంలో బాదడం మినహా పైసా ఇచ్చేరకం కాదని తేలిపోయింది. పోనీ వైఎస్‌ జగన్ మాదిరిగా ప్రభుత్వం అప్పుడో ఇప్పుడో పదో పరకో ఏదో పథకం కింద ఇస్తే దానికి తోడు ఏదో పనిచేసుకుని ఊళ్ళో ఉండచ్చు అనుకుంటే చంద్రబాబులో ఏ కోశానా ఆ ఆలోచన లేదు..  దీంతో  పేద .. దిగువ మధ్యతరగతివాళ్ళు ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారు. వేరే ఊళ్ళో పస్తులున్నా.. కూలీ చేసుకున్నా ఎవరూ అడగరు... అవమానం లేదు.. అందుకే వెళ్ళిపోతున్నాం అంటూ కన్నీళ్లతో ఊరు విడుస్తున్న కుటుంబాలు అక్షరాలా 12 లక్షలని తేలింది.. ఇక బాబు పేదరిక నిర్మూలన ఆలోచనలు  ఇంకెప్పుడు అమల్లోకి వస్తాయో.. పేదలు ఎప్పుడు కాస్త ఎదుగుతారో.. ఈలోపు ఎన్ని పేద ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో..
-సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement