
బాబు కోసం సొంత క్యాడర్‌పై వేటు
టీవీ రామారావును సస్పెండ్ చేసిన సేనాని
నేనే పాతికేళ్ల పాటు చంద్రబాబు పల్లకి మోయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఎన్నాళ్ళు సీఎంగా ఉన్న ఆయన గుమ్మం ముందు కాపలాకు సిద్ధమయ్యాను.. అలాంటిది చంద్రబాబును, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే ఎలా ఊరుకుంటాను అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఏమైనా గానీ పార్టీలో ఎదగాలంటే పార్టీ అధినేత కనుసన్నల్లో.. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తేనే ముందుకు వెళ్లగలరు.. ఉన్నతమైన స్థానాలు పొందగలరు. అలాకాకుండా అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన కావచ్చు ప్రశ్నలు సంధిస్తే మాత్రం ఖర్చయిపోతారు అని జనసేన అని రుజువు చేస్తున్నారు.
వాస్తవానికి సేనాని పొత్తు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో కూటమికి అధికారం దక్కేది కాదు. కానీ, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కు ఏపాటి ప్రాధాన్యం దక్కుతుంది అన్నది జనం మొత్తానికి తెలుసు. ఇది ఎలా ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో జన సైనికులను తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. జన సైనికులను రాజకీయ కార్యకర్తలుగా కన్నా డబ్బులు ఇస్తే వచ్చే కూలీలుగానే ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకుని చంద్రబాబు వద్ద తాబేదారుగా పని చేస్తున్నపుడు మధ్యలో మీరు ఎందుకు గొంతెత్తుతారు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం తరఫున జనసేనకు రావలసిన నామినేటెడ్ పదవులు విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నది. ఎక్కడ ఏ విభాగంలో నామినేటెడ్ పోస్టులు నియామకాలు జరుగుతున్నా అక్కడ జన సైనికులకు కచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. మంచి పోస్టులు ప్రాధాన్యం ఉన్న పోస్టులన్నీ తెలుగుదేశం వాళ్ళు తన్నుకుపోతుండగా మిగిలిపోయిన చిన్నా చితకా పదవులు నామ్ కే వాస్తే జన సైనికులకు దక్కుతున్నాయి. భారీ వేట అనంతరం సింహం తినగా మిగిలిన ఎముకలు బొమికలు దక్కించుకుని కుక్కలు నక్కలు పండగ చేసుకున్నట్లుగా జన సైనికుల పరిస్థితి ఉంది.
మొన్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి చైర్మన్‌లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 పదవులకు గాను 12 పదవులు తెలుగుదేశానికి కేటాయించారు. ఆ పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. మిగిలిన రెండు పోస్టులు జనసేనకు చెందిన కాపు నేతలకు ఇచ్చారు. మొత్తం 14 పోస్టుల్లో దాదాపుగా 90 శాతం పదవులు తెలుగుదేశం వారే తీసుకోవడాన్ని అక్కడి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు అవమానకరంగా భావించారు.
తమ పార్టీని ఇంత చిన్నచూపు చూడటమా.. మరీ బిచ్చం వేసినట్లు రెండంటే రెండు పదవులు ఇస్తారా అంటూ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. వాస్తవానికి ఇలాంటి పదవులు పంపిణీ జరిగేటప్పుడు జనసేన, తెలుగుదేశం నాయకులు మధ్య సమన్వయం అవసరం. ఇరుపార్టీల నాయకులు చర్చించుకుని పదవులు పంచుకోవాలి. అయితే, రాష్ట్రంలో జనసేనకు పవన్ కళ్యాణ్ మినహా మరో నాయకుడు లేరు. నాగబాబు అప్పుడప్పుడు కనిపించి వెళ్లడమే తప్ప పార్టీలో ఆయనకు అధికారం లేదు.. బాధ్యత కూడా లేదు. దీంతో తమ కష్ట నష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా కార్యకర్తలకు నాయకులకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్‌ను కలవడం అసాధ్యం. దీంతో టీవీ రామారావు అలాంటి సీనియర్ నాయకులు ఇలా తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు.
కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా బయట పెట్టినందుకు టీవీ రామారావుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశమే పవన్ కళ్యాణ్‌కి ఉంటే ఇలాంటి అంశాలను నోట్ చేసుకొని.. కార్యకర్తలు నాయకులతో చర్చించి తమకు రావాల్సిన పదవులు వాటాను తెచ్చుకునేవారు. కానీ, పవన్‌కు పార్టీ మీద, కార్యకర్తల మీద ఎలాంటి ఆపేక్ష లేనట్లు ఈ సస్పెన్షన్‌తో అర్థమవుతుంది.
నేనే చంద్రబాబుకు మరో పాతికేళ్ళు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ప్రశ్నించడానికి మీరు ఎవరు?. పదవులు కానీ ఇంకేమైనా ప్రయోజనాలు కానీ చంద్రబాబు దయాదాక్షిణ్యలతో ఇస్తే తీసుకోవాలి తప్ప ప్రశ్నిస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు వంటి సీనియర్ నాయకుడికే పార్టీలో రక్షణ లేకపోతే కిందిస్థాయిలో ఉండే తమకు ఇంకేం ఉంటుందని మండల స్థాయి నాయకులు లోలోన కుమిలిపోతున్నారు
-సిమ్మాదిరప్పన్న.