చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరిపై మండిపడిన వైఎస్సార్‌సీపీ
డ్రగ్స్ కేసు, మహిళలపై వేధింపుల ఆరోపణల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోరు?
కమిటీల విచారణలు, షోకాజ్ నోటీసుల డ్రామాలు ఆపాలి
కూటమికి చెందిన నిందితులపై చర్యలు తీసుకోవాలి
ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని క్షమించరు ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్‌సీపీ ధ్వజం
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు.. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పట్టుబడితే మాత్రం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లో అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం.. కూటమి నేతల డ్రగ్స్ కేసులు, మహిళలపై పాల్పడుతున్న నేరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకుండా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది’ అని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరిని వైఎస్సార్‌సీపీ ఎక్స్ వేదికగా సోమవారం ప్రశ్నించింది.
ఏలూరు నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్న కేసులో అడ్డంగా పట్టుబడ్డారని, ఇలాంటి ఘటన పార్లమెంట్ చరిత్రలో అరుదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ బలాన్ని ఉపయోగించి బెయిల్‌పై బయటకు తీసుకురావడం, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు, డ్రగ్స్ పరీక్షలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
రక్త పరీక్షల్లో కొకైన్ వాడినట్లు పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారని, దీనిపై స్పందించాలని కోరారు. అలాగే మహిళలపై వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ మండిపడింది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన అత్యాచార ఆరోపణలు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై వేధింపుల ఆరోపణలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్‌పై అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు లేవని ధ్వజమెత్తింది.
మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఒక మహిళను మోసం చేశాడని ఆరోపణలు వచి్చనప్పటికీ స్పందన లేకపోవడం ఆందోళనకరమని తెలిపింది. కమిటీల విచారణలు, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆపి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని క్షమించరని ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది.


