
సాక్షి, అమరావతి: ఒకసారి తెగిపోయి మళ్లీ అతుక్కున్న బీజేపీ– జనసేన పార్టీల స్నేహబంధం ఏడాదికే తెగతెంపులయ్యే దిశగా సాగుతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రకటనతో రెండు పార్టీల మధ్య తెగతెంపులకు నాంది పలికారా? అనే అనుమానాలు కలిగించగా విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్ చేసిన ప్రకటనతో ఇక రెండు పార్టీల స్నేహానికి ముగింపు ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ఆదివారం రోజు బీజేపీ అభ్యర్ధికి కాకుండా టీఆర్‌ఎస్ బలపరిచిన మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు మద్దతు తెలుపుతూ పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమను వాడుకుని వదిలేసిందని జనసేన నాయకులు నా దృష్టికి తెచ్చారు. గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాంటివారితో మీరు ఇంకా స్నేహం చేయండి అని చెప్పే ధైర్యం నాకు లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు. అనంతరం కొద్దిసేపటికే జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విజయవాడలో ఓ వీడియో విడుదల చేస్తూ బీజేపీ విధానాల వల్లే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందని ఆరోపించారు. బీజేపీ విధానాలను రాష్ట్ర ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు.
రహస్య స్నేహితులు...
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా.. ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్‌కల్యాణ్ రహస్యంగా టీడీపీతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో స్నేహం కొనసాగిస్తున్నారని ఆదినుంచి విమర్శలున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి టీడీపీకి ప్రయోజనం కలిగించాలని పవన్‌కల్యాణ్ భావించినా బీజేపీ నేతలు అక్కడ తామే పోటీ చేస్తామని ప్రకటించారు. టీడీపీని చేరువ చేసేందుకు పవన్ చేసిన ప్రయత్నాలు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద చెల్లుబాటు కాలేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ఎత్తుగడలు పారకపోవడంతో ఇక దీన్ని ఎక్కువ కాలం కొనసాగించరాదన్న చంద్రబాబు సూచనల మేరకే పవన్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని టీడీపీతో బహిరంగ స్నేహం దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.