రాజకీయ భేటీ కాదు!.. ఎన్సీపీ స్పష్టీకరణ

Opposition Leaders Hold Meeting At Sharad Pawars Residence - Sakshi

పవార్‌ నివాసంలో రాష్ట్రీయ మంచ్‌ భేటీ 

పలు జాతీయాంశాలపై చర్చ 

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాల మధ్య నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసంలో రాష్ట్రీయ మంచ్‌ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయమంచ్‌ వ్యవస్థాపకుడు యశ్వంత్‌ సిన్హా అధ్యక్షత వహించారు. ఇది రాజకీయ భేటీ కాదని, భావసారూప్యం కలిగిన పార్టీలు, మేధావుల భేటీగా ఎన్సీపీ పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారి పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సమాజంలోని కీలక వ్యక్తులు రాష్ట్రీయ మంచ్‌ వేదికపై ప్రత్యక్షంగా ఒకేచోట సమావేశమయ్యారు.

ఈ భేటీలో శరద్‌ పవార్‌ (ఎన్సీపీ), యశ్వంత్‌ సిన్హా (తృణమూల్‌ కాంగ్రెస్‌), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), ఘన్‌శ్యామ్‌ తివారీ (సమాజ్‌వాదీ పార్టీ), జయంత్‌ చౌధరి (రాష్ట్రీయ లోక్‌దళ్‌), సుశీల్‌ గుప్తా (ఆప్‌), బినోయ్‌ విశ్వం (సీపీఐ), నీలోత్పల్‌ బసు( సీపీఎం), సంజయ్‌ ఝా (కాంగ్రెస్‌ మాజీ నేత), సుప్రియా సులే (ఎన్సీపీ) వంటి నాయకులతో పాటు జావేద్‌ అక్తర్, మాజీ బ్యూరోకాట్‌ కేసీ సింగ్, రిటైర్డ్‌ జస్టిస్‌ ఎ.పి. షా వంటి మేధావులతో కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్రోల్‌ – డీజిల్‌ ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యవస్థలపై దాడి, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను చర్చకొచ్చాయని భేటీలో పాల్గొన్న వారు తెలిపారు.

ఈ భేటీ అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ ఈ సమావేశం రెండున్నర గంటల పాటు జరిగిందని, అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా... కాంగ్రెసేతర థర్డ్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను ఎన్సీపీ నాయకుడు మజీద్‌ మెమన్‌ తిరస్కరించారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ మంచ్‌ చీఫ్‌ యశ్వంత్‌ సిన్హా ఏర్పాటు చేశారని, పవార్‌ కాదని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు కపిల్‌సిబల్, అభిషేక్‌ మను సింఘ్వి, మనీష్‌ తివారీలకు కూడా ఆహ్వానించామని, ఇతర కారణాల వల్ల వారు హాజరుకాలేదని తెలిపారు. సీపీఎం నేత నీలోత్పల్‌ బసు కూడా ఇది భావసారూప్యత కలిగిన వ్యక్తుల మధ్య సమావేశమేనని, దీన్ని రాజకీయ భేటీగా చూడకూడదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top