Congress Party: ఐక్యత సరే.. దూకుడేదీ!

Nizamabad Congress Party Leaders Unity Revanth Reddy PCC Committee - Sakshi

తాజాగా రేవంత్‌కు జైకొట్టిన జిల్లా కాంగ్రెస్‌ నేతలు 

క్షేత్రస్థాయిలో ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ ఇటీవల తగ్గిన కార్యక్రమాలు 

మరోవైపు తాజా పీసీసీ కమిటీల్లో చోటుదక్కని నాయకుల్లో అసంతృప్తి 

జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఐక్యత కనిపిస్తున్నటికీ క్షేత్రస్థాయిలో దూకుడు కనిపించడం లేదు. సీనియర్ల పిలుపునకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో జరిగిన పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశానికి హాజరై రేవంత్‌కు మద్దతుగా నిలిచారు. పారీ్టయే ముఖ్యమని చాటి చెప్పారు. 

సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య గ్యాప్‌ పెరిగిన నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం అంతా ఒక్కటే అనేవిధంగా నాయకులు ఐక్యత కనబరుస్తున్నారు. ఆదివారం రాజధానిలో జరిగిన పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశానికి వెళ్లవద్దని రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పిలుపునిచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగా జిల్లా నుంచి కీలక నాయకులందరూ హాజరయ్యారు. రేవంత్‌రెడ్డికే జైకొడతామన్నవిధంగా వ్యవహరించారు. మాకు పారీ్టయే ముఖ్యమని జిల్లా నాయకులు చెబుతున్నారు.

జిల్లా నుంచి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి, పీసీసీ కోశాధికారి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్‌ ఈరవత్రి అనిల్, పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, కాట్‌పల్లి నగే‹Ùరెడ్డిలతో పాటు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో పాల్గొన్నారు. అయితే జిల్లా నుంచి పీసీసీ కమిటీలో చోటు ఆశించినప్పటికీ దక్కకపోవడంతో కేశ వేణు, బాడ్సి శేఖర్‌గౌడ్, అంతిరెడ్డి రాజిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. వీరు ముగ్గురూ జిల్లాలోని అందరు నేతలతో సఖ్యతగానే ఉంటున్నప్పటికీ పీసీసీలో పదవులు దక్కకపోవడంతో నారాజ్‌గా ఉన్నారు. 

జిల్లాలో నాయకులందరూ ఐక్యతగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు తక్కువగా ఉండేవి. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడయ్యాక వరుసగా కార్యక్రమాలతో నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ నింపారు. తర్వాత పార్టీ డిజిటల్‌ విధానంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లోనూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 1.5 లక్షల సభ్యత్వాలు చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పర్యవేక్షించడంతో పాటు జిల్లాలో పర్యటించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్, ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డితో పాటు నాయకులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

అదేవిధంగా జిల్లాలో ఇతర కార్యక్రమాలకు సైతం అంతగా హాజరు కాకపోవడంతో సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో ఈరవత్రి అనిల్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పాల్గొన్న కార్యకర్తలందరూ ఈరవత్రికి మద్దతుగా నిలిచారు. మధుయాష్కీ రాకపోవడం పట్ల ఈరవత్రి అసహనం వ్యక్తం చేయగా కార్యకర్తలు మూకుమ్మడిగా చేతులెత్తి మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా పార్టీ క్షేత్రస్థాయి కార్యక్రమాలు అంతగా చేపట్టడం లేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జిల్లా నాయకులు పార్టీని ఏమేరకు దూకుడుగా ముందుకు తీసుకెళతారనేది చూడాల్సిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న దశలో, మరోవైపు బీజేపీ కార్యకలాపాలు పెంచుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగాల్సిన అవసరముందని పార్టీ కిందిస్థాయి కార్యకర్తలు చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top