
జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరిలో బహిరంగ సభలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16, 18, 19 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వివిధ చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 15 నుంచి 19 దాకా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ మూడు తేదీల్లో మూడుచోట్ల పారీ్టపరంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభల్లో ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరిలలో సభల నిర్వహణకు రాష్ట్ర పార్టీ సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనకు సంబంధించిన వివరాలను సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి తెలియజేశారు. ఒక్కో చోట నిర్వహించే బహిరంగసభలో రెండు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల సభలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలు, నాగర్‌కర్నూల్ బహిరంగసభలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మల్కాజిగిరి సభలో భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు కవరయ్యేలా కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.