Munugode Bypoll: నల్లగొండ, యాదాద్రిలో ఎన్నికల కోడ్

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియామవళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల్లోనూ ఇది అమల్లో ఉండనుందని నల్లగొండ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగకుండా చూడాలని ఎస్పీ రెమా రాజేశ్వరికి లేఖ రాశారు.
మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి రాతలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని పేర్కొన్నారు. నవంబర్ 8న ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
చండూరులో నామినేషన్ల స్వీకరణ
ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 7వ తేదీన ప్రారంభం కానుంది. చండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15వ తేదీన ఉప సంహరణలు ఉంటాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఏఎంఆర్‌పీ) జగన్నాథరావు పేరునే ప్రతిపాదించారు. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారిగా కొనసాగనున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కోసం చండూరు డాన్‌బాస్కో స్కూల్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఈవీఎంలను ఆర్జాలబావిలోని గోడౌన్‌కు తరలించనున్నారు. కౌంటింగ్ కూడా ఆర్జాలబావిలోనే నిర్వహిస్తారు.
అదనపు కలెక్టర్ సమీక్ష
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు సోమవారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ ఆర్‌డీఓ జయచంద్రారెడ్డి, ఈఆర్‌ఓ జగన్నాథరావు, ఎన్నికల విభాగం అధికారులతో కోడ్ అమలుపై ఆయన సమీక్షించారు. ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన వీడియోగ్రఫీపై సూచనలు చేశారు.