మునుగోడు ఎన్నికల మూడ్‌ ఏంటీ?

Munugode Bypoll: Tension In Three Main Parties - Sakshi

మూడు పార్టీల నేతలకు టెన్షన్

మూడు పార్టీలకు మునుగోడు టెన్షన్ పట్టుకుంది. అభ్యర్థులతో పాటు నాయకులకు కూడా బీపీ పెరుగుతోంది. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోన ఆందోళనకు గురి చేస్తోంది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతోంది. కాని ఓటర్ల మనోగతం ఎలా ఉందో ఎవరికీ అంతుపట్టడంలేదు. చివరికి ఏమవుతుందో అన్న ఆతృత అందరినీ వెంటాడుతోంది. ఇంతకీ ఓటర్లు ఏమనుకుంటున్నారు? 

ఏ పార్టీలోనూ కనిపించని గెలుపు ధీమా
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చావో రేవో అన్న పరిస్థితి సృష్టించింది. రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న రాజకీయం, పార్టీల మార్పిళ్ళు, డబ్బు ఖర్చు, ఓటర్ల కోసం ఇస్తున్న ఆఫర్లు వంటివి తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం దిగ్ర్బాంతికి గురి చేస్తున్నాయి. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులకు, అక్కడ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల సీనియర్ నాయకులకు టెన్షన్ రోజు రోజుకూ పెరుగుతోంది.

సస్పెన్స్‌, క్రైం థ్రిల్లర్‌ను తలపించే విధంగా మునుగోడు రాజకీయాలు అనేక రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక కంటే... రాష్ట్రం భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికగా ప్రచారం జరుగుతోంది. కాని ప్రజల నాడి పట్టుకోవడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. మంచినీళ్ళలా డబ్బును ఖర్చు పెడుతున్నా.. చివరికి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నాయకులు.

అస్త్రశస్త్ర ప్రయోగం
ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా నియోజకవర్గంలో మకాం వేశారు‌. గత ఎన్నికల్లో జరిగి‌న పొరపాట్లు మరోసారి జరగకుండా గులాబీ పార్టీ నాయకత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మంత్రులందరినీ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం సాగిస్తోంది. బీజేపీ కూడా ఇప్పటి వరకు ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డితో పాటు మాజీ మంత్రులను రంగంలోకి దించి ప్రచారం సాగిస్తోంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఇంత మంది నేతలు నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తున్నా గెలుపుపై ఏ పార్టీలోనూ అంత ధీమా కనిపించడం లేదని ఆయా పార్టీల నేతలే అంటున్నారు. 

తింటారా.. తాగుతారా?
ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఓటర్ల అవసరాలను గుర్తించి వాటిని తీర్చి తమవైపుకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ఓటర్ల వద్దకు కూడా వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీలు చేస్తున్న పోటా పోటీ ఖర్చును చూస్తున్న ఓటరు కూడా నేతలకే ఆఫర్ ఇస్తున్నాడంట. ఇంతవరకు నేతలే వచ్చి.. గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తానంటూ ఆఫర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులు అయ్యాయని అంటున్నారు. ఎప్పుడు మీరేనా ఆఫర్లిచ్చేది? ఈసారి మేం మీకు ఆఫర్ ఇస్తామంటున్నారట‌.‌‌ మేం ఇంతమంది‌ ఓటర్లం ఉన్నాం ఇంత కావాలి.. ఇస్తే ఓటు మీకే అని నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారట.  చేసేదేం లేక అడిగినంత ముట్టజెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయని టాక్.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top