తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల | Sakshi
Sakshi News home page

30న మినీ మున్సి‘పోల్స్‌’

Published Thu, Apr 15 2021 1:32 PM

Municipal Election 2 Corporations 5 Municipalities Notification Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మినీ మున్సి‘పోల్స్‌’ కు నగారా మోగింది. ఈ నెల 30న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్‌ మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన పలు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. శుక్రవారం(నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఆదివారంతో ముగియనుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్‌ కొత్తగా ఏర్పడ్డాయి.

సిద్దిపేట పాలకమండలి పదవీకాలం గురువారం పూర్తికాగా, అచ్చంపేటలో వివిధ గ్రామపంచాయతీల విలీనం అనంతరం మున్సిపాలిటీగా మారాక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జల్‌పల్లి, అలంపూర్, గజ్వేల్, నల్లగొండ, బోధన్, బెల్లంపల్లి, మెట్‌పల్లి, పరకాల మున్సి పాలిటీల్లో ఖాళీలు ఏర్పడటంతో ఒక్కోవార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లన్నీ ఇదివరకే ఎస్‌ఈసీ పూర్తిచేయడంతో వెంటనే నామినేషన్ల స్వీకరణ, ఇతర ప్రక్రియలను చేపట్టడానికి మున్సిపల్‌ శాఖ సిద్ధమైంది. 

రిజర్వేషన్ల ఖరారు... గెజిట్‌ జారీ 
ఎన్నికలు జరగనున్న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం ఖరారు చేశారు. ఆ వెంటనే రిజర్వేషన్లను ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. ఆయా జిల్లాల్లో రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెకర్లు మహిళారిజర్వేషన్లకు సంబంధించి లాటరీ తీశారు. కొత్తగా ఏర్పాటైన కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవులకు రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి లాటరీలు తీశారు.

చైర్‌పర్సన్‌ స్థానాలకు నకిరేకల్‌ బీసీ జనరల్‌కు, జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల వివరాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందగానే ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతేడాది జనవరిలో మున్సిపల్‌ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... వరంగల్‌ మేయర్‌ పదవి జనరల్‌కు, ఖమ్మం మేయర్‌ పదవి మహిళకు, సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి మహిళకు, అచ్చంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి.

కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలి 
ప్రస్తుతం జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా కోవిడ్‌ ప్రొటోకాల్‌పై కేంద్ర హోంశాఖ వెలువరించిన మార్గదర్శకాలతోపాటు ఇతర నియమ, నిబంధనలను ఎస్‌ఈసీ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే ప్రతివ్యక్తి తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, పోలింగ్‌ స్టేషన్లలో శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, క్యూలైన్లలో భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరి చేయాలని, ప్రతిస్థాయిలో నోడల్‌ హెల్త్‌ ఆఫీసర్లను నియమించి ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు, నియంత్రణచర్యలు పర్యవేక్షించాలని సూచిస్తూ సర్క్యులర్‌ జారీచేసింది. 

ఎన్నికల కోడ్‌..
మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో ఒకవార్డు/డివిజన్‌కు ఎన్నిక జరిగినా మొత్తం మున్సిపాలిటీకి ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. ఒక జిల్లాలో మున్సిపాలిటీ జరుగుతుంటే ఆ మునిసిపాలిటీ వరకు మాత్రమే ఎన్నికల కోడ్‌ వర్తిస్తుంది.

అభ్యర్థులు తమ నామినేషన్లతోపాటు డిపాజిట్‌ ఇలా...

 • మున్సిపల్‌ కార్పొరేషన్లలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500, ఇతర అభ్యర్థులకు రూ.5,000
 • మున్సిపాలిటీల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250, ఇతర అభ్యర్థులకు రూ.2,500

వ్యయం ఇలా...

 • మున్సిపల్‌ కార్పొరేషన్ల (జీహెచ్‌ఎంసీ మినహా) డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,50,000 ఎన్నికల వ్యయ పరిమితి ఉంటుంది. జీహెచ్‌ఎంసీలోని డివిజన్‌కు పోటీచేసే వారికి రూ.5,00,000 ఎన్నికల ఖర్చు పరిమితి విధించారు.
 • మున్సిపాలిటీల పరిధిలోని వార్డులకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,00,000 ఎన్నికల ఖర్చు పరిమితి ఉంటుంది.
 • నామినేషన్లతోపాటు అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, తదితరాలను ఇద్దరు సాక్షుల అటెస్టేషన్‌తో నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పించాలి. 

ఇదీ షెడ్యూల్‌...

 • ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ 
 • తుది ఓటర్ల జాబితా వార్డులవారీగా 16న ప్రచురణ
 • 19న నామినేషన్ల పరిశీలన
 • నామినేషన్ల తిరస్కరణపై 20న అప్పీళ్ల స్వీకరణ
 • 21న అప్పీళ్లపై నిర్ణయం
 • 22న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
 • 30న పోలింగ్‌ 
 • మే 2న రీపోలింగ్‌ 
 • 3న ఓట్ల లెక్కింపు..  ముగిసిన వెంటనే ఫలితాల ప్రకటన

Advertisement
 
Advertisement
 
Advertisement