సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నవంబర్ నెల ఆయన రాత మార్చేసింది. నవీన్ యాదవ్ 1983 నవంబరు 17న పుట్టారు. 2023 నవంబరు 15న కాంగ్రెస్‌లో చేరారు. 2025 నవంబరు 14నే కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.
అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అవకాశం దక్కింది. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
పేరు: వల్లాల నవీన్ యాదవ్
తండ్రి పేరు: వి.చిన్న శ్రీశైలం యాదవ్
వయసు: 42 సంవత్సరాలు
విద్యార్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్
రాజకీయ అరంగ్రేటం: మజ్లిస్
ఎన్నికల్లో పోటీ:
2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిక
2025లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం


