ఠాక్రేకు షాకిచ్చిన సీనియర్‌ నేత.. | Sakshi
Sakshi News home page

ఠాక్రేకు షాకిచ్చిన సీనియర్‌ నేత..

Published Thu, Feb 4 2021 11:05 AM

MNS State Unit Vice-President Joins Shiv Sena - Sakshi

సాక్షి, ముంబై : కల్యాణ్‌–డోంబివలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల బెడద అధికమైంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ కదం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌)‌ నుంచి బయటపడి శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎంఎన్‌ఎస్‌ మాజీ ప్రతిపక్ష నాయకుడు మందార్‌ హలబే సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన మంగళవారమే బీజేపీలో చేరడం కలకలం సృష్టించింది. దీంతో డోంబివలిలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేనకు చెందిన పలువురు కీలక నాయ కులు, పదాధికారులు, కార్యకర్తలు పార్టీ నుంచి బయట పడే అవకాశం ఉంది. వీరంతా శివసేన, బీజేపీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో డోంబివలిలో ఎంఎన్‌ఎస్‌‌కు గట్టి దెబ్బ తగలడం ఖాయమని స్పష్టమవుతోంది. అంతేగాకుండా స్థానికంగా ఎంఎన్‌ఎస్‌‌ ప్రాబల్యం తగ్గిపోయి, వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే ప్రమా దం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

రాజు పాటిల్‌పై బాధ్యతలు.. 
ఎంఎన్‌ఎస్‌‌కు చెందిన డోంబివలి నగర అధ్యక్షుడు, ఎంఎన్‌ఎస్‌‌ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ కదం, తన సహచరులతో కలిసి సోమవారం సాయంత్రం శివసేనలో చేరారు. రాజేశ్‌ కదం శివసేనలో చేరడానికి శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే ప్రధాన పాత్ర పోషించారు. మాతోశ్రీ బంగ్లాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, థానే జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే సమక్షంలో రాజేశ్‌ శివసేనలో చేరారు. గతంలో శివసేనలో కొనసాగిన రాజేశ్‌ కదం ఎంఎన్‌ఎస్‌ స్థాపించిన తరువాత రాజ్‌ ఠాక్రేతోపాటు ఆయన కూడా బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఎంఎన్‌ఎస్‌‌లో కొనసాగిన రాజేశ్‌ కదం ఇలా అకస్మాత్తుగా పార్టీ మారడం జీర్ణించుకోలేకపోతున్నారు. రాజేశ్‌ శివసేనలో చేరి 24 గంటలు గడవక ముందే అంటే మంగళవారం ఎంఎన్‌ఎస్‌‌ కార్పొరేటర్, మాజీ ప్రతిపక్ష నాయకుడు మందార్‌ హలబే బీజేపీ ప్రదేశ్‌ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.

మందార్‌ రాజ్‌ ఠాక్రేకు అతి సన్నిహితుడని, డోంబివలిలో తిరుగులేని నాయకుడిగా పేరుంది. ఇలా వరుసగా ఇరువురు కీలక నాయకులు పార్టీ నుంచి బయటపడటంవల్ల భవిష్యత్తులో ఎంఎన్‌ఎస్‌‌కు నష్టం వాటిళ్లే ప్రమాదం లేకపోలేదు. వీరి కారణంగా డోంబవలిలో ఎమ్మెన్నెస్‌ బలహీనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంఎన్‌ఎస్‌‌ ఎమ్మెల్యే రాజు పాటిల్‌ త్వరలో జరగనున్న డోంబివలి కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల బాధ్యతలు ఆయనకే అప్పగించే సూచనలున్నాయి. ఇదిలా ఉండగా రాజేశ్‌ కదం శివసేనలో చేరడంవల్ల డోంబివలి నగర అధ్యక్ష పదవి మళ్లీ మనోజ్‌ ఘరత్‌కు కట్టబెట్టారు. ఎంఎన్‌ఎస్‌‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే సమక్షంలో ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మనోజ్‌ మూడేళ్లు నగర అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఇప్పుడు మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీలో నూతనోత్తేజాన్ని నింపినట్లయింది.  
 
బీజేపీతో కలుస్తారా? 
ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు కలిసికట్టుగా పోటీ చేసిన శివసేన, బీజేపీలు రాబోయే ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయనున్నారు. మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిఇలాఉండగా మరోవైపు ఈ మూడు పార్టీలు కలిస్తే వీరిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌‌)తో బీజేపీ చేతులు కలిపే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న శివసేనను అధికారానికి దూరం చేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో శివసేనను దెబ్బతీయడానికి వచ్చే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎంఎన్‌ఎస్‌‌తో జతకడుతుండవచ్చని వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగానే ఇటీవలె బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్‌ లాడ్‌ ఎమ్‌ఎన్‌ఎస్‌‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రేతో భేటీ కావడంతో వార్తలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో శివసేనను ఢీకొట్టడానికి బీజేపీ, ఎంఎన్‌ఎస్‌ ఒక్కటవుతాయా లేదా అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement