Konaseema Issue: అమలాపురం ఘటన వెనుక కుట్ర.. వదిలేదే లేదు: మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana Serious On Konaseema District Change Protests  - Sakshi

సాక్షి, అమరావతి: అమలాపురం ఘటన దురదృష్టకరమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అల్లర్ల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచివి కావని హితవు పలికారు. 

స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన అని అన్నారు. అంబేద్కర్‌ పేరు పెట్టాలన్న నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమలాపురంలో కాల్పులు జరిగితే లబ్ధి పొందాలని పవన్‌ చూస్తున్నారా అని నిలదీశారు.  పోలీసులు సంయమనం పాటించి ప్రాణ నష్టం లేకుండా నివారించారన్నారు.

‘మంత్రి, ఎమ్మెల్యేల ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అంబేద్కర్ ఒక‌కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. అంబేద్కర్ రాజ్యాంగ సృష్టి కర్త.  ఈరోజు మనం స్వేచ్చగా జీవించడానికి అంబేద్కర్ రాజ్యాంగమే కారణం. అటువంటి మహానుభావుడు పేరు పెడితే ఎందుకు అల్లర్లకి పాల్పడ్డారు. అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరిన మీదటే సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటి. ఏం సాధించాలని అమలాపురంలో చిచ్చు పెట్టారు. ఇది మంచి సంప్రదాయం‌కాదు. శాంతిభద్రతల పరిరక్షణపై ఉపేక్షించేది లేదు. ఈ ఘటనలో ప్రమేయమున్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి బొత్స అన్నారు.
చదవండి: ‘ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారు’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top