సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. మావోయిస్టులను అంతం చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అధికారంలో ఉన్నా, లేకున్నా నక్సలైట్ల అణచివేతే మా లక్ష్యం. తుపాకీ గొట్టంతో సాధించేది ఏమీలేదు. పౌరహక్కుల నాయకులే నక్సలిజం అంతరించి పోయిందని ఒప్పుకున్నారు. ఇన్ని రోజులు అమాయక పిల్లలు, యువకులను రెచ్చగొట్టింది అర్బన్ నక్సలైట్లే. వారికి ప్రజల బాధలు తెలియవు. వారిపైన కూడా చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడను. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యారు.
జంగల్‌లో ఉన్న నక్సలైట్లు పని పిల్లలకు తుపాకులు ఇస్తున్నారు. మావోయిస్టులను అంతం చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం. జంగల్ వదిలి, తుపాకులు విడిచిపెట్టి బయటకి రండి. తెలంగాణలోని కాంగ్రెస్ పాలనలో నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. నక్సలిజన్ని ఎవరు ప్రోత్సహించినా వారు నేరస్తులే అవుతారు. మావోయిస్టులకు మద్దతు ఇచ్చే వారిపై కూడా చర్యలు ఉంటాయి అని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


