రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: బండి సంజయ్‌ | Minister Bandi Sanjay Satirical Comments On KCR And Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: బండి సంజయ్‌

Apr 21 2026 1:29 PM | Updated on Apr 21 2026 2:46 PM

Minister Bandi Sanjay Satirical Comments On KCR And Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

కరీంనగర్‌లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అమృత్‌- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.

రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు..
ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకొనితింటున్నారు. కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.

జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్  నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుంది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది.

తేజస్వీ సూర్య కామెంట్స్‌పై.. 
తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే.. అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement