మామిళ్లపల్లిలో మళ్లీ పోలీసుల దౌర్జన్యకాండ | Mamillapalli Episode: Kutami Sarkar Police Over Action Arrest Jupudi | Sakshi
Sakshi News home page

మామిళ్లపల్లిలో మళ్లీ పోలీసుల దౌర్జన్యకాండ

May 20 2026 10:45 AM | Updated on May 20 2026 11:39 AM

Mamillapalli Episode: Kutami Sarkar Police Over Action Arrest Jupudi

సాక్షి, గుంటూరు: మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఈ క్రమంలో మరీ దుర్మార్గంగా వ్యవహరించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి ఈ ఉదయం పొన్నరూ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. 

అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకుని కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. న్యాయం చేయాలని కోరిన మొక్కజొన్న రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ దాడులు చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్‌సీపీ అంటోంది. అదే సమయంలో.. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇస్తోంది. 

చలో మామిళ్లపల్లిని నిర్వహించి రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు రైతుల్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూటమి సర్కార్‌ పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తూ కుట్రలు చేస్తోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఇవాళ జూపూడి ప్రభాకర్‌లను రైతుల్ని కలవనీయకుండా అడ్డుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement