ఎన్నికల సీజన్‌.. నేతల కప్ప గెంతులు | leaders changing parties rapidly in telangana before elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల సీజన్‌.. నేతల కప్ప గెంతులు

Nov 5 2023 7:30 PM | Updated on Nov 5 2023 7:31 PM

leaders changing parties rapidly in telangana before elections - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : ఎన్నికల సీజన్ వచ్చిందంటే కప్పగెంతులు సహజమే. ఉన్న పార్టీల్లో సీట్లు రానివారు, సీటు రాదని అనుకున్నవారు పార్టీలు మారిపోతుంటారు. ఎందుకు మారుతున్నారంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెబుతారు. అప్పటిదాకా సమర్థించిన పార్టీ అధినేతపై దారుణమైన విమర్శలు చేస్తారు. ఈసారి తెలంగాణలో కప్పగెతుల నాయకుల లీలలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య ఈ కుండ మార్పిళ్ళు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్లు తేదీ వచ్చేసినా పార్టీల మారే నాయకులు ఏమాత్రం తగ్గడంలేదు. రాష్ట్రంలో కీలకంగా మారిన జంపింగ్‌ జపాంగ్‌లు ఎవరో చూద్దాం. 

రాజకీయాల్లో సర్కస్ ఫీట్లు మామూలే. ఎన్నికల సీజన్లో ఏ నేత ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టమే. హఠాత్తుగా అడిగితే కొందరు నాయకులు కూడా తమ పార్టీ పేరు గభాల్న చెప్పలేరనే సెటైర్లు కూడా పేలుతుంటాయి. ఎన్నికల్లో సీట్లు రావని ఖరారు చేసుకున్న నేతలు ఏ పార్టీలోకి వెళితే టిక్కెట్ వస్తుందో...దేనిలో చేరితో కచ్చితంగా గెలుస్తామో అంచనా వేసుకుంటారు. దానికి అనుగుణంగా కొత్త పార్టీలో చేరుతుంటారు. పార్టీ ఎందుకు మారారంటే ఫలానా పార్టీని ఎదిరించాలంటే ఈ పార్టీలోనే ఉండాలని...లేదంటే తనకు ఆత్మగౌరవం దెబ్బతినిందని అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెబుతుంటారు. ఎన్నికలయ్యాక ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే అభివృద్ది జపం చేయాలి. నా నియోజకవర్గం అభివృద్ది చేసుకోవడానికే అధికార పార్టీలోకి వెళుతున్నానని ఓ ప్రకటన చేసేస్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జంపింగ్‌ జపాంగ్‌లు ఎక్కువై పొలిటికల్ స్క్రీన్ గందరగోళంగా కనిపిస్తోంది.

చిన్నా చితకా నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని మంత్రి పదవులు నిర్వహించినవారు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి ఎంతో అనుభవం సాధించినవారు ఉన్నఫళంగా పార్టీ మారితే అటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ...ఇటు ప్రజల్లోనూ తప్పకుండా చర్చ జరుగుతుంది. ఈ విడతలో ముందుగా గులాబీ పార్టీ నుంచే వలసలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గులాబీ పార్టీని వీడారు. తర్వాత మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాలలో జడ్‌పీ ఛైర్మన్‌ గా ఉన్న సరిత గులాబీ గూటినుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గులాబీ పార్టీ సీటు ఇవ్వలేదన్న కోపంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కారు దిగి గాంధీభవన్‌కు చేరుకున్నారు. అలాగే పాలమూరు జిల్లాలో సీనియర్ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి టిక్కెట్ల విషయంలో పార్టీ అధినాయకత్వం మీద అలిగి కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. టిక్కెట్ల విషయంలో తమ పంతం నెరవేర్చుకున్నారు. 

ఎన్నికల హడావుడి ప్రారంభం కాగానే మొదలైన నాయకుల వలసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత స్పీడందుకున్నాయి. ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ రెండు జాబితాల్లో ప్రకటించిన వంద మంది అభ్యర్థుల్లో 22 మంది అప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే ఉండటం ఇతర పార్టీలకు ఆశ్చర్యం కలిగించగా...పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నవారికి ఆగ్రహం తెప్పించాయి. అందుకే వలస పక్షుల్ని అందలం ఎక్కించినపుడు ఇంకా మేమెందుకు అంటూ కాంగ్రెస్ నుంచి నాగం జనార్థనరెడ్డి వంటి సీనియర్లు గులాబీ గూటికి చేరారు. అలాగే ఒకప్పుడు సీఎం కేసీఆర్‌ను ప్రాజెక్టుల రీ డిజైన్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య సీటు రానందుకు నిరసనగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసేసి కేసీఆర్ సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ టిక్కెట్ ఆశించిన దివంగత నేత పి. జనార్థనరెడ్డి తనయుడు విష్ణువర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి టిక్కెట్లు లభిస్తుండగా...బీఆర్ఎస్లో చేరినవారికి ఎమ్మెల్సీలో...ఇతర పదవులో హామీ ఇస్తున్నారు.

ఒకప్పుడు బీజేపీ మంచి ఊపుమీదున్న సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విభేదించి...మునుగోడు ఎమ్మెల్యీ సీటుకు కూడా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపు పెరగడం..బీజేపీ హవా తగ్గడం వంటి పరిణామాలతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉదయం తన నియోజకవర్గం అయిన మునుగోడు టిక్కెట్ తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య తిరుగుతున్న మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి తన కుమారుడితో సహా బీజేపీకి రాజీనామా చేసి తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెస్‌లో చేరిపోయారు. రాజకీయ జీవితంలో చరమాంకంలో ఉన్న నాయకులు కూడా పలువురు ఇప్పుడు అటు కాంగ్రెస్‌లోను..ఇటు బీఆర్‌ఎస్‌లోనూ చేరిపోతున్నారు. 

అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే ఎక్కువ మార్పిడీలు జరిగాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు...బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు నాయకులు ఎక్కువగా జంపింగ్‌లు చేశారు. బీజేపీలో ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు చేసి నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో చేరినవారు ఒకరిద్దరే కనిపిస్తున్నారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి సీనియర్లు కమలదళం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలో నామినేషన్లు ప్రారంభం కానుండటంతో పార్టీలు మారేవారు తొందరపడుతున్నారు. నామినేషన్లు పూర్తయ్యేనాటికి ఇంకెన్ని వింతలు చూడాల్సి ఉంటుందో అనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఈ జంపింగ్‌ రాయుళ్ళను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీళ్లంతా  పార్టీలు మారేది ప్రజలకు సేవ చేయడానికా..తమకు తాము సేవ చేసుకోవడానికా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement