సీఎం జగన్‌ స్పీచ్‌ ప్రారంభం కాగానే..

Kommineni Srinivasa Rao Comment On Grand Success Of YSRCP Plenary - Sakshi

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ చివరి ఘట్టానికి చేరుకుంది. ఇక ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రసంగించడమే తరువాయి . ఆ తరుణంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక విజ్ఞప్తి చేశారు. భోజనశాలలో ఉన్న కార్యకర్తలు కూడా తిరిగి సభా స్థలికి వచ్చి ,ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని కోరారు. ఆశ్చర్యం వేసింది. జగన్ స్పీచ్ ప్రారంభం అయ్యేసరికి నిజంగానే ఎక్కడెక్కడి కార్యకర్తలు వచ్చి తమ సీట్లో ఆసీనులవడంతో ఆ శిబిరంలో ఎక్కడా ఖాళీ కుర్చీనే దాదాపుగా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల సమావేశం పెడితే , ఇంత శ్రద్దగా సభలో కూర్చుంటారా? వక్తల ఉపన్యాసాలు వింటారా? అందులోను పార్టీ అధినేత స్పీచ్ వినడానికి అంతలా ఆసక్తి కనబరుస్తారా? అన్న భావన కలిగింది. 

జగన్ తన స్పీచ్లో ఎక్కడా కార్యకర్తలను విసిగించేలా మాట్లాడలేదు. వారిలో స్పిరిట్ నింపే విధంగా మాట్లాడారని చెప్పాలి.జగన్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే ఆయన హుందాగా మాట్లాడడానికి ప్రాధాన్యం ఇస్తూనే, తను చెప్పవలసిన విషయాలను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. నవరత్నాల గురించి ఎన్నికలకు ముందు ఏమి చెప్పింది వివరిస్తూ, ప్రతి అక్క, ప్రతి చెల్లికి చెప్పండి.. ప్రతి అన్న ..ప్రతి తమ్ముడికి చెప్పండి ..జగనన్న రెండు నెలల్లో అధికారంలోకి వస్తాడు. కచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పమన్నాను . అని అంటూ..ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నామా?లేదా అని ప్రశ్నించారు. పార్టీ చరిత్రను తెలియచేస్తూ ఒక ఎమ్మెల్యేతో ఆరంభం అయిన పార్టీ ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల స్థాయికి చేరిందని, వచ్చే ఎన్నికలలో 175 సీట్లకు, 175 గెలుచుకోవడం అసాధ్యం ఏమి కాదని స్పష్టం చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలలో జోష్ నింపే యత్నం చేశారు. తాను చేసిన పనుల గురించి వివరించడం ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఆయన చేసిన ఒక కామెంట్ అందరిని ఆకర్షించింది. 

చంద్రబాబు తన చేతి వేలికి ఉన్న ఉంగరంలో చిప్ ఉందని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, చిప్ ఉండాల్సింది వేలికి కాదని, మెదడుకు, హృదయానికి అని ఆయన ఎద్దేవా చేశారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన నియోజకవర్గమైన కుప్పం ను రెవెన్యూ డివిజన్ చేయాలని తమ ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపారని, దానిని కూడా తాము ఆమోదించామని జగన్ చెప్పినప్పుడు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్యూడల్ పెత్తందార్లకోసం పనిచేస్తుందని, చంద్రబాబుది వెన్నుపోట్ల సిద్దాంతం అయితే, తమది నిబద్దతతో కూడిన విధానం అని,పేద, దిగువ మధ్యతరగతి వారికోసం పనిచేసే పార్టీ అని ఆయన పోల్చి చెప్పారు. 

ఇందుకు ఉదాహరణ ఇస్తూ చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల పిల్లలు, మనుమళ్లు ఆంగ్ల మీడియంలో చదవాలి కాని, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని వారు చెబుతున్నారని, ఇది ప్యూడల్ ధోరణి కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వారెవ్వరూ సమాధానం ఇవ్వలేకపోతున్న మాట వాస్తవం. రాజకీయ ప్రత్యర్ధుల వీక్ పాయింట్ మీద బలంగా కొట్టడం ఒక సూత్రం. దానిని జగన్ సమర్ధంగా పాటించారని అనిపిస్తుంది. ప్రత్యేకించి విద్యారంగంపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కార్పొరేట్ స్కూళ్ల కోసం చంద్రబాబు పనిచేస్తే, తాను పేదలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్ల కోసం పనిచేస్తున్నానని ఆయన వివరించారు. విద్యారంగంలో తాను తీసుకు వచ్చిన సంస్కరణల నేపధ్యంలో జగన్ ఈ అంశాన్న పదే,పదే ప్రస్తావించినట్లు అనిపిస్తుంది.ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కి ఎంత ప్రాధాన్యం ఇచ్చింది. 

ఆస్పత్రులను ఎలా మార్చుతున్నది, కొత్తగా 16వైద్య కళాశాలలను నెలకొల్పడానికి యత్నిస్తున్నది తదితర విషయాలను ఆయన వివరించారు. ఆరోగ్యశ్రీలో 2466 వ్యాధులను చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తదుపరి ఆయన రైతు భరోసా అంశానికి, ఆర్బికె లలో జరుగుతున్న కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. పేదలకు నేరుగా లబ్దిదారులకు లక్షా ఏభైవేల కోట్ల రూపాయలను నగద బదిలీ ద్వారా అవినీతిలేకుండా స్కీములు అమలు చేసిన విషయాన్ని ఆయన వివరించారు. ఉపన్యాసంలోని పలు అంశాలు గత కొంతకాలంగా చెబుతున్నవే అయినా, వాటిని వివరించిన తీరు పార్టీవారిని ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. 

కోనసీమ జిల్లాకు రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పేరు జత చేస్తే టీడీపీ, జనసేనలు ఎస్‌సి మంత్రి ఇంటిని, ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని దగ్దం చేస్తారా అని ప్రశ్నించినప్పుడు సభికులలో వచ్చిన స్పందనను బట్టి ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. ఈ వ్యవహారం తమకు రాజకీయంగా లాభం చేస్తుందని ఆశించిన టీడీపీ, జనసేనలకు వీరి రియాక్షన్ చూశాక, వారికి తీవ్ర ఆశాభంగం తప్పదని తేలుతుంది. అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అక్కడ పెట్టారని అన్నారు. దుష్టచతుష్టం అంటూ చంద్రబాబు, ఈనాడు, ఆంద్రజ్యోతి , టివి5ల తీరును ఆయన దుయ్యబడుతూ ఎల్లోమీడియా అబద్దాలు చెప్పినంతమాత్రాన అవి వాస్తవాలు కావని, గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామసింహాలు అసలు సింహాలు కాలేవని ఎద్దేవా చేశారు.  

పనిలో పని ఆయన దత్తపుత్రుడిని కూడా వదలలేదు. ఒక వైపు ప్రభుత్వపరంగా చేసినవాటిని చెబుతూనే, మరో వైపు రాజకీయంగా ప్రత్యర్ధులపై దాడి తీవ్రతను తగ్గించకుండా జాగ్రత్తపడ్డారని చెప్పాలి. అంతిమంగా 175 స్థానాలు గెలుపే లక్ష్యమని ఆయన పిలుపు ఇవ్వడం పార్టీ కార్యకర్తలలో జోష్ నింపే యత్నం చేశారు. విశేషం ఏమిటంటే జగన్ స్పీచ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటూనే ఉన్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడుకు పెద్ద ఎత్తున జనం వచ్చారని ప్రచారం చేసిన టీడీపీ మీడియాకు ఒకరకంగా ఈ ప్లీనరీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్లీనరీకే ఇన్ని లక్షల మంది వస్తారని వారు ఊహించి ఉండకపోవచ్చు. దీంతో మహానాడు వెలవెల పోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇలా జనం తరలివస్తే ఎన్నికల మూడ్ అనుకోవచ్చు.కాని ఇంకా రెండేళ్లు సమయం ఉండగా జరిగిన ఈ ప్లీనరీకి ఇంత భారీగా కార్యకర్తలు వచ్చారంటే,దాని అర్ధం ప్రజలలో వైసీపీకి ఆదరణ చెక్కుచెదరలేదనే తేలుతుంది. 

ఇంత భారీగా వచ్చినంత మాత్రాన గెలవాలని ఉందా అన్న ప్రశ్న రావచ్చు. కాని వచ్చినవారు స్పందించిన తీరు ముఖ్యం. ఆ విషయంలో జగన్ స్పీచ్కి కాని , మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ వంటివారు మాట్లాడినప్పుడు కాని జనం హర్షద్వానాలు చేసిన తీరు కూడా గమనించవలసి ఉంటుంది. అందులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందకు,వంద శాతం మార్కులు పడతాయి.పార్టీ ప్రధాన వేదిక ఉన్న శిబిరంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో, అంతకు పలురెట్ల మంది బయట ఉండడం, రోడ్లన్ని జనం తో కిక్కిరిసిపోవడం స్పష్టంగా కనిపించింది. మాజీ మంత్రి పేర్ని నాని జరగబోయే ఎన్నికలు జగన్ కేంద్రంగా జరుగుతాయని, ఎమ్మెల్యేలు ఎవరూ శాశ్వతం కాదని, కార్యకర్తలే కీలకం అని, వారిలో అసంతృప్తి ఉండబోదని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సందేశం పంపించారని అనిపించింది. అదే సమయంలో పైర్ బ్రాండ్ గా పేరొందిన మరో మాజీ మంత్రి కొడాలి నాని ప్రసంగించనున్నారని ప్రకటించగానే , సభికులలో వచ్చిన రియాక్షన్ చూస్తే ఈయనకు ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. 

తొలి రోజు పార్టీ గౌరవాద్యక్షురాలు విజయమ్మ రాజీనామా ప్రకటన సంచలనత్మాకంగా ఉందని చెప్పాలి. అయితే ఆమె చెప్పిన తీరు, వివరించిన కారణాలు, రెండు రోజుల పాటు సమావేశాలలో జగన్ చెంతనే కూర్చోవడం ద్వారా తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేని తేటతెల్లం చేశారు. ఇది కూడా టిడిపి మీడియాకు నిరాశ మిగిల్చింది. విజయమ్మ ప్లీనరీకి రాకుండా రాజీనామా ప్రకటన చేస్తారేమోనని, ఒకవేళ వచ్చినా ఆమె రాజీనామా పార్టీలో ప్రకంపనలు రేపుతుందని వారు ఆశించినా, ఆమె మాత్రం చాలా హుందాగా, కుమారుడిపట్ల తన ప్రేమాభిమానాలు కనబరుస్తూనే, తెలంగాణలో తన కుమార్తె షర్మిలకు అండగా ఉండడానికే అని వివరించడంతో పార్టీకి సమస్య రాకుండా పోయింది. జగన్ ను పార్టీ శాశ్వత అద్యక్షుడిగా నియమావళి సవరించుకోవడం కూడా ఆసక్తిగా ఉంది. గతంలో కరుణానిధి కూడా తమిళనాడులో ఇలాంటి పదవిలోనే ఉన్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షుడు సాధారణంగా చాలాకాలం ఒకరే ఉంటారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో సోనియాగాంధీ గత 23 ఏళ్లుగా అద్యక్ష స్తానంలో ఉన్నారు. ఇది దాదాపు శాశ్వత అధ్యక్ష పదవి అన్నట్లుకాకుండా మరొకటి అవుతుందా? అంతదాకా ఎందుకు ఎన్.టి.ఆర్. తన కుటుంబమే తనను దారుణంగా అవమానించి తొలగించేంతవరకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. 

ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించిన చంద్రబాబు ఉమ్మడి ఎపి విభజన వరకు టిడిపి అధ్యక్ష పదవిలోనే ఉన్నారు. విభజన తర్వాత జాతీయ అధ్యక్ష పదవి క్రియేట్ చేసుకుని కొనసాగుతున్నారు. అంటే 27 సంవత్సరాలుగా ఆయన అధినేతగా కొనసాగుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం వైసిపిలో శాశ్వత అధ్యక్ష పదవి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తానేమో ఎన్నికైనట్లు, రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను నియమించినట్లు నాటకీయత నడుపుతున్నారే తప్ప, తానేమీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పుకోవడం లేదు. ఇక్కడే చంద్రబాబుకు , జగన్ కు తేడా తెలుస్తుంది. చంద్రబాబు ప్రతిదానిని మాయ చేయాలని అనుకుంటారు. జగన్ పెయిర్ గా ,పారదర్శకంగా ఉండాలని అనుకుంటారు. అందుకే బహుశా ఈ శాశ్వత అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. ఇక తీర్మానాల గురించి వస్తే నవరత్నాల గురించి బాగా పోకస్ పెట్టారు. అదే సమయంలో వక్తలంతా సహజంగానే ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఇది సహజంగా అన్ని పార్టీలలో జరిగేది. సమయాభావం వల్ల అన్ని తీర్మానాలపై వక్తలు పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోయారు. ఏది ఏమైనా తమ పార్టీ మహానాడు హిట్ అయిందని టిడిపి నేతలు చంకలు గుద్దుకుంటున్న సమయంలోనే వైసిపి ప్లీనరీ సూపర్ హిట్ అవడం ద్వారా ప్రజలు ఎటు వైపు ఉన్నది మరోసారి తేలిందని అనుకోవచ్చేమో!

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top