
సాధారణంగా తొంభై ఏళ్ల వయసులో ఎవరైనా ఏమి చేస్తారు! రామా,కృష్ణా అంటూ జపం చేసుకుంటూ కాలం గడుపుతారు.కాని ఈనాడు మీడియా అధినేత రామోజీరావు మాత్రం నిత్యం ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పారాయణం చేస్తున్నారు. చిత్తశుద్దితో సీఎం పేదలకు చేస్తున్న మంచి పనులను తలచుకుంటూ గడిపినా కాస్త పుణ్యం వస్తుందేమో! అలా చేయకపోతే మాని, ఈ ముసలి వయసులో ఆయన పగ, కక్ష, ద్వేషం అనే మూడు లక్షణాలతో రగిలిపోతున్నారు. వైఎస్ జగన్‌ను పదవి నుంచి దించేసి తన నమ్మిన బంటును సీటు ఎక్కించాలన్న తాపత్రయంతో ఉచ్చనీచాలు మరిచిపోతున్నారు. రాసిన అబద్దాన్నే పదే, పదే రాస్తూ, చూపిన అసత్యాన్నే పలుమార్లు చూపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలని విశ్వయత్నం చేస్తున్నారు.
ఆనాటి కుట్రలో రామోజీ కూడా భాగమే..
✍️ఆయనే జడ్జి అయి అన్నిటికి తీర్పులు ఇచ్చేస్తున్నారు. సీఎంపై గతంలో సోనియాగాంధీ, చంద్రబాబులు కలిసి పెట్టిన కేసుల గురించి ఎంత దారుణంగా వార్తలు ఇప్పుడు ఇస్తున్నారో చూడండి. దానికి కారణం ఒకటే. ఆనాటి కుట్రలో రామోజీరావు కూడా భాగస్వామి కావడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఎన్నికల సమయంలో జగన్‌పై ఎలాగైనా బురద చల్లాలన్న దురుద్దేశం ఈ ఎనభై ఎనిమిదేళ్ల వృద్దునిలో స్పష్టంగా కనిపిస్తుంది. లేకుంటే జగన్ కేసులో విచారణ ఆలస్యం అవుతోందట. విచారణ వాయిదాలు పడుతోందట. రామోజీకి అది పెద్ద కడుపు నొప్పి గా మారింది. అక్కడితో ఆగారా? లేదు.. మొత్తం కేసులో జగన్ తప్పు చేసినట్లు ఈనాడు రామోజీరావు నిర్దారించి సీబీఐ పక్కా ఆధారాలతో అభియోగపత్రం వేసిందట. ఈడీ ట్రిబ్యునల్ ఆస్తుల అటాచ్ మెంట్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి మాత్రం ఈయనకు గుర్తు ఉండదు.
ఇంత నీచంగా రాసేవారిని జర్నలిస్టు అని అంటారా
✍️సాక్షి పత్రికను జగన్ కొందరు పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రారంభించారు. వారెవ్వరికి లేని తీట రామోజీకి ఎందుకో తెలియదు. కేవలం తన పత్రికకు పోటీగా వచ్చిందన్న అక్కసు తప్ప మరొకటి కాదు. ఎంత పైత్యంతో రాశారో చూడండి. అవినీతి జన్మ నక్షత్రం అట. అక్రమార్జన పుట్టుమచ్చగా అట. .పారిశ్రామికవేత్తలు ప్రలోభాలకు లొంగారట. విజయసాయిరెడ్డి అక్రమ వ్యూహాలను సీబీఐ ఆధారాలతో బయటపెట్టిందట. అలాంటి కేసును తేల్చనీయకుండా, విచారణ సాగనీయకుండా పుష్కరకాలంగా సాగదీస్తున్నారట సమయం, సందర్భం లేకుండా ఇంత నీచంగా రాసేవారిని జర్నలిస్టు అని అంటారా? జర్నలిజాన్ని వ్యభిచారంగా మార్చారని ఎవరైనా అంటే కాదని అనగలిగే పరిస్థితి ఉందా?
చంద్రబాబుపై ఉన్న కేసుల్లో స్టేల మాటేమిటి?
✍️కేవలం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయాలన్న తాపత్రయం తప్ప మరొకటి ఇందులో లేదు. రామోజీరావుపై గత నలభై ఏళ్లలో ఎన్ని వందల కేసులు వచ్చి ఉంటాయి?వాటిలో కొన్ని ఎన్ని దశాబ్దాలపాటు వాయిదాలు పడ్డాయి? తన కేసులు ఎప్పటికి తేలకుండా రామోజీ ఎన్ని వ్యూహాలు అమలు చేస్తుంటారో ఆయన గురించి బాగా తెలిసినవారు ఈ మద్య ఇంటర్వ్యూలలో కూడా చెబుతున్నారే. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసుల్లో స్టేల మాటేమిటి? 2008 ప్రాంతంలో రామోజీరావు తన మార్గదర్శి సంస్థ ద్వారా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని తేలింది. దాంతో ఆయన సుమారు 2600 కోట్లు చెల్లించవలసి వచ్చింది.
✍️అప్పుడు రిలయన్స్ సంస్థ తన మీడియా షేర్లను విక్రయించవలసి వచ్చింది. దాని విలువ లెక్కకడితే ఒక్కో షేర్ ఖరీదు ఐదు లక్షలపై మాటేనని అప్పట్లో నిపుణులు లెక్కకట్టారు. మరి అది ఎలా సాద్యం అయింది? ప్రపంచంలో ఎక్కడైనా ఎంత ప్రతిష్టాత్మక సంస్థకైనా షేర్ విలువ ఆ మోతాదులో ఉందా? దానిని అక్రమ వ్యవహారం అని ఎందరు వ్యాఖ్యానించలేదు. అయినా రామోజీ దానిపై కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. కాని ఇప్పుడు సాక్షి పత్రికలో పెట్టిన పెట్టుబడులను మాత్రం అక్రమం అని చెబుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.
ఈనాడు పత్రిక ఎలా వచ్చింది
✍️అసలు రామోజీకి ఈనాడు పత్రిక ఎలా వచ్చింది. దాని అసలు పెట్టుబడి దారులు జగన్నాదరెడ్డి అని ఈ మధ్యే కదా అందరికి తెలిసింది. జగన్నాదరెడ్డి కుమారుడు యూరిరెడ్డి వచ్చి తన వాటా తనకు ఇవ్వడంలో రామోజీ మోసం చేశారని ఎందుకు ఆరోపించారు? రామోజీకి ఎవరైనా భూమి లీజుకు ఇస్తే ఇంతే సంగతి అన్నట్లు మార్కెటఖలె ఉన్న టాక్ గురించి ఏమి చెబుతారు? విశాఖలో లీజు తీసుకున్న భూమి కొంత భూ సేకరణలో పోతే దానికి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కూడా తానే తీసుకున్నారన్న అభియోగంలో వాస్తవం ఉందా?లేదా? ఆ పరిహారం తనదని ఆ స్థలం యజమాని ఎంతకాలం న్యాయ పోరాటం చేయవలసి వచ్చింది.
రామోజీ వివరణ ఇవ్వలేకపోయారు..
✍️ఎన్ని దశాబ్దాల పాటు ఆ కేసు తేలనివ్వకుండా రామోజీ కోర్టులను అడ్డుపెట్టుకుని కధ నడిపించారు.విజయవాడ ఈనాడు స్థలం పరిస్థితి కూడా అంతే కదా? అక్కడ తన యూనిట్‌ను మార్చివేసినా భూమి యజమానికి తిరిగి వెనక్కి ఇచ్చివేయడానికి ఎంతగా వేధించారన్నదానిపై ఆయన సమీప బంధువులే విమర్శలు చేస్తుంటారే. అవన్ని ఎందుకు! కొంతకాలం క్రితం ఏపీ సీఐడీ విబాగం మార్గదర్శి అక్రమాలను విచారించి సుమారు 800 కోట్ల నల్లధనం చలామణి చేశారని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. దాని గురించి ఎందుకు రామోజీ వివరణ ఇవ్వలేకపోయారు? ఈనాడు మీడియాలో నైతిక విలువల గురించి పుంఖాను పుంఖాలుగా సంపాదకీయాలు రాసే రామోజీరావు తనకు మాత్రం అవి అవసరం లేదని భావిస్తున్నారా?
✍️రామోజీనే తీర్పు ఇస్తున్నారు
జగన్‌పై సీబీఐకేసు పెడితే ఆదారాలుఉన్నట్లు. అదే తనపై సీఐడీ కేసు పెడితే మాత్రం వాటికి ఆదారాలు లేనట్లు అని రామోజీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవచ్చా! సీఐడీ కేసు విచారణ సాగకుండా సుప్రింకోర్టు వరకు రామోజీ ఎందుకు వెళ్లారు? కేసు దర్యాప్తు నిమిత్తం రామోజీ వద్దకు సీఐడీ అధికారులు వెళితే అప్పుడు ఆయన డ్రామా మాటేమిటి? ఇక చంద్రబాబు ఎన్ని ఏళ్లుగా ఎన్ని కేసులలో స్టేలు తెచ్చుకుంది తెలియదా? చంద్రబాబు తన కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఎందుకు అడ్డుకునే యత్నం చేస్తున్నారు? ఏపీ సీఐడీ ఆయనపై స్కిల్ స్కామ్ కేసుతో సహా పలు కేసులు పెడితే అవన్ని అక్రమమని రామోజీ తానే తీర్పు ఇచ్చేస్తుంటారు.
చెత్త కథనాలు
✍️తాను, చంద్రబాబు,తన అంతేవాసులంతా అచ్చమైన నీతిమంతులు అన్నట్లు చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తూప్రజలలో రామోజీ నవ్వుల పాలు అవుతున్నారు. తాను ఏది చెబితే అదే వేదం అన్నట్లు ఇష్టారీతిన చెత్త కథనాలు ఇస్తున్న వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రోజూ జగన్‌పై పడి రోధించడం, దానికి పరాకాష్టగా జనవరి ఎనిమిదో తేదీన రాసిన వాయిదాల వీరుడు, అవినీతి ధీరుడు అంటూ పాత కథనే కొత్తగా రాసినట్లు పాఠకులను వంచించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. జగన్ ఎంపీ కాకముందే పత్రికను ఆరంభించారు.ఆ తర్వాత రెండేళ్లకు ఎంపీ అయ్యారు. 2009నలో అనూహ్యంగా రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.
కక్షకట్టిన చంద్రబాబు
✍️ఆ సందర్భంలో పలువురు వైఎస్ అభిమానులు ఆ బాధ తట్టుకోలేక చనిపోయారు.వారిని ఓదార్చడానికి తాను స్వయంగా వారి ఇళ్లకు వెళ్లడం వల్ల జగన్ నాయకుడిగా ఎదుగుతారని కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గాలు అదిష్టానానికి పితూరీలు చేసింది.అయినా జగన్ వారిని లెక్క చేయకుండా ఓదార్పుయాత్రతో ముందుకు వెళ్లడం, కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకుని ఉప ఎన్నికలో పోటీచేసి రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కక్షకట్టిన సోనియాగాందీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై కేసులు పెట్టించారన్నది వాస్తవం కాదా? ఈ కుట్రలో రామోజీరావుకు భాగస్వామ్యం ఉందన్నది చాలామంది భావన.
✍️ఈనాడుకు పోటీగా సాక్షి తయారవడం దానిని సహించలేక రామోజీ తన అక్కసును ఆ రోజుల్లోనే సీబీఐవిచారణ పేరుతో ప్రదర్శించారన్నది జగమెరిగిన సత్యం.ఆ కేసు సమయంలో ఒక సీబీఐఅదికారితో కుమ్మక్కై ఈనాడు,తదితర టిడిపి మీడియా జగన్‌పై ఎంత అన్యాయంగా వార్తలు ఇచ్చారో చెప్పలేం. 2014 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయినా, 2019 లో అసాధారణమైన మెజార్టీతో జగన్ అధికారంలో రావడంతో ఈనాడు రామోజీరావుకు జీర్ణం కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో కక్ష పట్టి ప్రతి రోజూ జగన్‌పై విద్వేష పూరిత కధనాలు ప్రచురిస్తున్నారు. ప్రసారం చేస్తున్నారు.
మీడియాను అడ్డం పెట్టుకొనిప్రజలను వంచించినట్లేనా?
✍️2024 ఎన్నికలు ఇక మూడు నెలల్లో జరగనుండడంతో కాలకూట విషాన్ని వెదజల్లే క్రమంలో భాగంగా రామోజీరావు గ్యాంగ్ రెచ్చిపోయి రాస్తోంది. ఈ క్రమంలో ఆయన తనకు తెలియకుండా బట్టలు లేకుండా నడిరోడ్డుమీద తిరుగుతున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యాపించింది. ఈ పరిస్థితిని ఆయన కుమారుడు కిరణ్ ఎందుకు వారించడం లేదో తెలియదు. లేదా తండ్రితో పాటు తాను కూడా అలాగే తిరుగుతున్నారా అన్న అనుమానం వస్తుంది. లేదా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా ఈనాడు సంపాదక సిబ్బందిని తన కంట్రోల్ లోకి తీసుకుని ఇలాంటి విషపూరిత కధనాలు రాయిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది.ఏది ఏమైనా ఒకప్పుడు ఈనాడు అంటే విలువలకు ప్రాతిపదిక అన్నట్లు పోజులు ఇచ్చిన రామోజీ ఇప్పుడు వాటన్నిటిని మర్యాదకోసం అయినా పాటించడం లేదంటే దాని అర్దం ఇంతకాలం ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను వంచించినట్లేనా?
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.