కర్ణాటకలో సినిమా అట్టర్ ఫ్లాప్, తెలంగాణలో పరిస్థితేంటి? కాషాయ కండువా కప్పుకునేది ఎవరు?

Are Karnataka Election Results Affect BJP In Telangana State Who Will Join In Telangana BJP - Sakshi

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపుతాయా? తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ఆశలపై కర్ణాటక నీళ్ళు చల్లిందా? కర్ణాటక షాక్ నుంచి తెలంగాణ కాషాయసేన ఇప్పట్లో కోలుకుంటుందా? బీజేపీలోకి వలసలు కొనసాగుతాయా? ఆగుతాయా? అసలు తెలంగాణ కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి?

కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేయడమేనని తెలంగాణ కాషాయ సేన భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ, కన్నడ ప్రజలు వారి ఆశలు అడియాశలు చేసేశారు.

భారీ అంచనాలతో విడుదలైన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా కర్ణాటక బీజేపీ పరిస్థితి తయారైంది. అస్థిర రాజకీయాలకు తెర దించుతూ కాంగ్రెస్ విజయ దుంధుభి మోగించింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపగా.. బీజేపీ నేతల్లో నిరాశ మిగిల్చింది. ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ ఆఫీస్‌లో ఒక్కసారిగా సందడి తగ్గిపోయింది. స్తబ్తత ఆవరించింది.
(ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి)

చేరికలేవీ?
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీజేపీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి మినహా.. చెప్పుకోదగ్గ స్థాయిలో చేరికలు జరగలేదు. కన్నడ నాట ఫలితాల ఎఫెక్ట్ తో చేరిన నేతలు కూడా డైలమాలో పడ్డారు. 

తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ఈటల రాజేందర్ వెళ్లిన సందర్భంలో పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఇప్పట్లో కాషాయ కండువా కప్పుకునేది ఎవరు? కొత్తగా బీజేపీలో చేరే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
(బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌.. రంగంలోకి హైకమాండ్‌)

ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు బీజేపీ వైపు చూడటం కష్టమేనని వాళ్ల వర్గీయులు చెబుతున్నారు. వాళ్లు కాంగ్రెస్‌ వైపు అడుగేస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

గ్రూపు తగాదాలతో రగిలిపోతున్న తెలంగాణ కమలదళం... కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తో బలహీనపడుతుందా? నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతాయా? అనే చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటకలో ఓడినంత మాత్రాన తెలంగాణలో పార్టీ దూకుడు ఏమాత్రం తగ్గదని.. రెట్టించిన ఉత్సాహంతో కమలదళం కార్యరంగంలోకి దూకుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top